Collegium: కొలీజియం సిఫార్సులపై కేంద్రం తీరు.. విసుగుతెప్పిస్తోంది: సుప్రీం

 న్యాయమూర్తుల నియామకాల కోసం కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను కేంద్రం పెండింగ్‌లో ఉంచడంపై సుప్రీంకోర్టు అసహనం ప్రదర్శించింది.

Updated : 28 Nov 2022 17:03 IST

దిల్లీ: హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను నెలల తరబడి కేంద్రం పెండింగ్‌లో పెట్టడంపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కొలీజియం సిఫార్సు చేసిన కొన్ని పేర్లు ఏడాదిన్నరగా పెండింగ్‌లోనే ఉండటంపై ధర్మాసనం మండిపడింది. ఈ ఆలస్యం అసహనానికి గురిచేస్తోందని వ్యాఖ్యానించింది.

న్యాయమూర్తుల నియామకాల్లో జరుగుతున్న జాప్యాన్ని సవాల్‌చేస్తూ అడ్వొకేట్స్‌ అసోసియేషన్‌ బెంగళూరు దాఖలుచేసిన పిటిషన్‌పై జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌కౌల్‌, జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓకాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ‘‘ఎలాంటి కారణాలు లేకుండా కొలీజియం సిఫార్సులను పెండింగ్‌లో పెట్టకూడదు. కొన్ని పేర్లను ఏడాదిన్నరకు పైగా పెండింగ్‌లోనే ఉంచుతున్నారు. ఇది మొత్తం వ్యవస్థకే విసుగుతెప్పిస్తోంది. జైతోష్‌ మజుందార్‌పేరును కొలీజియం రెండోసారి పునరుద్ఘాటించినప్పటికీ  2021 సెప్టెంబర్‌ 4 నుంచి ఆయన నియామకం పెండింగ్‌లో ఉంది. చివరకు సదరు వ్యక్తి ఇటీవల కన్నుమూశారు. కొలీజియం సిఫార్సు చేసిన మరో వ్యక్తి.. ఆలస్యం కారణంగా తనంతట తానే వెనక్కి తగ్గారు’’ అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. 

ప్రస్తుతానికి ఈ కేసులో తాము నోటీసులు మాత్రమే జారీ చేస్తున్నామని చెప్పిన ధర్మాసనం.. చట్టం ఉన్నంతవరకూ దాన్ని పాటించాలన్న కోర్టు సూచనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని అటార్నీ జనరల్‌, సొలిసిటర్‌ జనరల్‌కు సూచించింది. నియామకాల సమస్యను కేంద్రం వెంటనే పరిష్కరించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో తాము చట్టపరంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి తీసుకురావొద్దని కేంద్రాన్ని సూచించింది. అనంతరం ఈ పిటిషన్‌పై విచారణను డిసెంబరు 8వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని