Supremecourt: పిల్లలు ఏడింటికే స్కూల్‌కు వెళ్తుంటే.. మనం 9 గంటలకు రాలేమా?

చిన్నారులు ఉదయం 7 గంటలకే పాఠశాలలకు వెళ్తున్నప్పుడు న్యాయమూర్తులు, న్యాయవాదులు 9 గంటలకు ఎందుకు విధులు ప్రారంభించకూడదంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ వ్యాఖ్యానించారు. సాధారణంగా కోర్టు పనిగంటలు

Updated : 16 Jul 2022 07:42 IST

సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ యు.యు.లలిత్‌ వ్యాఖ్య

దిల్లీ: చిన్నారులు ఉదయం 7 గంటలకే పాఠశాలలకు వెళ్తున్నప్పుడు న్యాయమూర్తులు, న్యాయవాదులు 9 గంటలకు ఎందుకు విధులు ప్రారంభించకూడదంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ వ్యాఖ్యానించారు. సాధారణంగా కోర్టు పనిగంటలు 10.30కి ప్రారంభం అవుతాయి. అయితే శుక్రవారం జస్టిస్‌ లలిత్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఓ కేసు విచారణను ఉదయం 9.30 గంటలకే ప్రారంభించింది. విచారణకు హాజరైన సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ దీనిపై సంతోషం వ్యక్తం చేయగా జస్టిస్‌ లలిత్‌ స్పందిస్తూ.. ‘‘చిన్నారులు ఉదయం ఏడు గంటలకే పాఠశాలలకు వెళ్తున్నప్పుడు.. న్యాయమూర్తులు, న్యాయవాదులు ఎందుకు ఉదయం తొమ్మిది గంటలకు తమ పని ప్రారంభించకూడదని నేను ఎప్పుడూ చెబుతుంటాను. కోర్టులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. తొమ్మిది గంటలకు పని ప్రారంభించి, పదకొండున్నర తర్వాత అరగంట విరామం తీసుకోవాలి. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు పని ముగించుకోవచ్చు. దీనివల్ల సాయంత్రం కేసు ఫైళ్లు చదువుకోవడానికి మరింత సమయం దొరుకుతుంది’’ అని చెప్పారు. సాధారణంగా వారంలో ఐదురోజుల పాటు కోర్టులు పనిచేస్తాయి. రోజు పని గంటలు ఉదయం పదిన్నరకు ప్రారంభమై సాయంత్రం నాలుగుకు ముగుస్తాయి. అందులో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి గంటపాటు లంచ్‌ బ్రేక్‌ ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని