NEET PG 2023: నీట్‌-పీజీ ప్రవేశ పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరణ

నీట్‌ పీజీ ఎంట్రన్స్‌ పరీక్ష మార్చి 5న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ చేశామని.. ఇప్పుడు వాయిదా వేస్తే సమీప భవిష్యత్తులో నిర్వహించేందుకు అవకాశం ఉండదంటూ ఎన్‌బీఏ తరఫున ఏఎస్‌.ఈ ఐశ్వర్యా భాటి కోర్టుకు తెలిపారు.

Published : 27 Feb 2023 22:22 IST

దిల్లీ: వచ్చే నెల 5న జరగాల్సిన నీట్-పీజీ ఎంట్రన్స్‌ పరీక్ష(NEET-PG entrance exam)ను వాయిదా వేయాలన్న అభ్యర్థనల్ని సుప్రీంకోర్టు(Supreme court) తోసిపుచ్చింది. నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)-పీజీ 2023ని వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను కొట్టివేసింది. ఈ పరీక్షకు షెడ్యూల్‌ ప్రకారమే సోమవారం నుంచి అడ్మిట్‌ కార్డులు విడుదల చేశామని.. కౌన్సిలింగ్ ప్రక్రియ జులై 15 నుంచి జరుగుతుందని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌(ఎన్‌బీఈ) తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్యాభాటి ధర్మాసనానికి వివరించారు. ఒకవేళ పరీక్ష వాయిదా వేస్తే..  ఈ సమీప భవిష్యత్తులో పరీక్ష నిర్వహణకు మళ్లీ ప్రత్యామ్నాయ తేదీ కూడా ఏదీ అందుబాటులో లేదని తెలిపారు. దీంతో జస్టిస్‌ ఎస్‌ఆర్‌ భట్‌, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణకు నిరాకరించింది. మార్చి 5న పరీక్షలు నిర్వహిస్తే ప్రిపేర్‌ అయ్యేందుకు సమయం చాలదని.. అందువల్ల మూడు నెలల పాటు వాయిదా వేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా నీట్‌ పీజీ పరీక్ష వాయిదా డిమాండ్‌పై దేశ రాజధాని నగరంలో ఆందోళనలు కూడా చేపట్టారు. 

అంతకముందు, నీట్ పీజీ పరీక్షకు ప్రిపేర్‌ అయ్యేందుకు తగినంత సమయం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేశారు. అందువల్ల పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసనలకు సైతం దిగారు. కటాఫ్ తేదీల విషయంలో విద్యార్థుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్రం నీట్ పీజీ ఇంటర్న్‌షిప్ కటాఫ్ తేదీని పెంచిన విషయం తెలిసిందే. గత శుక్రవారం విచారణ సమయంలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్‌బీఏ) తన వాదనలు వినిపిస్తూ నీట్‌-పీజీ రాసేందుకు 2.09 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది. మార్చి 5న జరగాల్సిన ఈ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా వేయలేమని చెప్పింది.  అయితే, వాయిదా వేయకపోతే ఎంతమందిపై ప్రభావం పడొచ్చంటూ న్యాయస్థానం ప్రశ్నించగా.. 45వేల మంది అని అధికారులు చెప్పారు. ఈ సమస్యకు ఒక పరిష్కారంతో రావాలని కోరుతూ నేటికి విచారణ వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం ఎన్‌బీఈ తరఫు న్యాయవాది చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల పిటిషన్లను కొట్టివేసింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు