NEET UG 2024: నీట్‌ నిర్వహణలో రవ్వంత నిర్లక్ష్యం కనిపించినా కఠిన చర్యలుండాలి

వైద్య కోర్సుల్లో సీటు దక్కించుకోవడం కోసం విద్యార్థులు ఎంతగానో శ్రమిస్తుంటారని, అటువంటి ప్రవేశ పరీక్ష నిర్వహణలో రవ్వంత కూడా నిర్లక్ష్యం తగదని సుప్రీంకోర్టు పేర్కొంది.

Updated : 19 Jun 2024 06:03 IST

జాతీయ పరీక్షల మండలికి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

 దిల్లీ: వైద్య కోర్సుల్లో సీటు దక్కించుకోవడం కోసం విద్యార్థులు ఎంతగానో శ్రమిస్తుంటారని, అటువంటి ప్రవేశ పరీక్ష నిర్వహణలో రవ్వంత కూడా నిర్లక్ష్యం తగదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎవరైనా తప్పిదానికి పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు ఉండాలని, ఆ సమస్యను సంపూర్ణంగా పరిష్కరించాలని జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ ఎస్‌.వి.ఎన్‌.భట్‌లతో కూడిన సెలవుకాల ధర్మాసనం విస్పష్టం చేసింది. మే 5న జరిగిన నీట్‌-యూజీ(2024)కి సంబంధించి గ్రేస్‌మార్కులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లపై ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ‘‘వైద్య కోర్సు ప్రవేశ పరీక్షల కోసం విద్యార్థులు పడే శ్రమ అందరికీ తెలుసు. వ్యవస్థను మోసం చేసి డాక్టర్‌ అయ్యే వ్యక్తి సమాజానికి ఎంత హానికరమో ఊహించండి. అంతటి ప్రాధాన్యం గల పరీక్ష నిర్వహించే సంస్థ దృఢంగా వ్యవహరించాలి. ఏదైనా పొరపాటు జరిగితే దానిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పాలి. మీ పని తీరుతో అభ్యర్థుల్లో విశ్వాసం కల్పించాలి’’ అంటూ జాతీయ పరీక్షల మండలి (ఎన్టీఏ)కి ధర్మాసనం చురకలంటించింది. జరిగిన తప్పిదాలపై సకాలంలో చర్యలు ఉండాలని నొక్కి చెబుతూ తదుపరి విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది. నీట్‌-యూజీ పరీక్ష పత్రం లీకేజీపై సీబీఐతో దర్యాప్తు సహా పరీక్షను మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్లతో ఇప్పటికే దాఖలైన ఇతర పిటిషన్లను అదే రోజున విచారించనున్నట్టు ధర్మాసనం తెలిపింది. తాజా పిటిషన్లపైనా రెండు వారాల్లోగా సమాధానం దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఏలను ఆదేశించింది. నీట్‌-యూజీలో 1,563 మందికి ఇచ్చిన గ్రేస్‌ మార్కులను రద్దు చేసినట్లు న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఏ ఈ నెల 13న తెలిపాయి. అంతకుముందు ఇదే అంశంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం...నీట్‌-యూజీ పరీక్ష పవిత్రతకు విఘాతం కలిగిందని వ్యాఖ్యానించింది.

మోదీ మౌనం ఎందుకు?: రాహుల్‌ 

నీట్‌ పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, విపక్షాలు ధర్నాలు చేస్తున్నా ప్రధాని మోదీ ఎందుకు స్పందించట్లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. పరీక్ష పత్రాల లీకేజీలను అరికట్టేందుకు బలమైన విధానాల రూపకల్పనకు పార్లమెంటు భరోసా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే పాలిత రాష్ట్రాలైన బిహార్, గుజరాత్, హరియాణాల్లో జరిగిన అరెస్టులు పరీక్ష నిర్వహణలో వ్యవస్థీకృత అవినీతి జరిగిందని రుజువు చేస్తున్నాయన్నారు. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు తారుమారు అయినా ప్రధాని మోదీ ఎప్పటిలాగే మౌనం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా పాలిత రాష్ట్రాలు ప్రశ్నాపత్రాల లీకేజీలకు కేంద్రంగా మారాయని ఆరోపిస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో రాహుల్‌ గాంధీ పోస్ట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని