SC: పెళ్లి చేసుకుంటానని అత్యాచారం.. జాతకం కుదరలేదని మోసం!

ఓ అత్యాచార బాధితురాలికి కుజదోషం ఉందా? లేదా? తేల్చాలంటూ అలహాబాద్‌ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఒక బెయిల్ పిటిషన్‌ విచారణలో.. జ్యోతిష నివేదికను సమర్పించాలని ఎందుకు అడిగిందో అర్థం కావడం లేదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

Published : 03 Jun 2023 23:32 IST

దిల్లీ: ఓ కేసు విచారణలో భాగంగా అత్యాచార బాధితురాలికి కుజ దోషం (Manglik) ఉందా? లేదా? తేల్చాలంటూ లఖ్‌నవూ యూనివర్సిటీకి అలహాబాద్‌ హైకోర్టు (Allahabad High Court) జారీ చేసిన ఆదేశాలపై సుప్రీం కోర్టు (Supreme Court) స్టే విధించింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీం ధర్మాసనం శనివారం ప్రత్యేకంగా సమావేశమై ఈ మేరకు విచారణ చేపట్టింది. అసలు ఓ బెయిల్ పిటిషన్‌ విచారణ కేసులో.. జ్యోతిష (Astrology) నివేదికను సమర్పించాలని ఎందుకు అడిగారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి.. బెయిల్‌ కోసం అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించాడు. ఆమెకు కుజ దోషం ఉందని, అందుకే ఇద్దరికి వివాహం కుదరదని వాదించాడు. అయితే, అలాంటిదేమీ లేదని బాధితురాలి తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో ఆమెకు కుజదోషం ఉందా? లేదా? తేల్చాలంటూ లఖ్‌నవూ యూనివర్సిటీలోని జ్యోతిష శాస్త్ర విభాగానికి హైకోర్టు ఇటీవల ఆదేశించింది. మూడు వారాల్లోపు నివేదికను సీల్డ్‌ కవరులో సమర్పించాలని సూచిస్తూ.. కేసును జూన్ 26కు వాయిదా వేసింది.

ఈ వ్యవహారం కాస్త సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ దృష్టికి వెళ్లింది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఆయన.. వెంటనే దీనిపై విచారణకు బెంచ్‌ ఏర్పాటు చేయాలని రిజిస్ట్రీకి ఆదేశించినట్లు సమాచారం. దీంతో జస్టిస్‌ సుధాన్షు ధులియా, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌లతో కూడిన ధర్మాసనం శనివారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశాలపై విస్మయం వ్యక్తం చేసింది. ‘ఇది పూర్తిగా అసందర్భోచితం. దీనికి కేసుకు సంబంధం ఏంటీ? అని ప్రశ్నించింది. పైగా ఇది గోప్యత హక్కుకు భంగం కలిగించడం వంటి అనేక అంశాలతో ముడిపడి ఉందని పేర్కొంది.

అయితే, ఇరుపక్షాల అంగీకారంతోనే హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిందని నిందితుడి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. జ్యోతిషం ఒక విజ్ఞాన శాస్త్రమని వాదించారు. దీనికి అంగీకరించిన సుప్రీం ధర్మాసనం.. ఒక న్యాయసంస్థ ఓ పిటిషన్‌ను పరిశీలిస్తున్నప్పుడు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చా? అని ప్రశ్నించింది. ఈ క్రమంలోనే హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. తదుపరి విచారణను జులై 10కి వాయిదా వేసింది. అయితే, బెయిల్ దరఖాస్తుపై విచారణను కొనసాగించవచ్చని అలహాబాద్ హైకోర్టుకు అనుమతి ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని