ఆ సంభాషణపై విచారణ అవసరం లేదు: సుప్రీం

సస్పెండైన మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ రామకృష్ణతో తాను సంభాషణ జరిపినట్టు జస్టిస్‌ ఈశ్వరయ్య అంగీకరించినట్టు అఫిడవిట్‌ దాఖలు చేసినందున అందులోని వాస్తవాల నిర్ధరణకు విచారణ అవసరం లేదని...

Updated : 12 Apr 2021 23:56 IST

నిర్ణయాధికారం హైకోర్టుదే
జస్టిస్‌ ఈశ్వర్యయ్య కేసులో పిల్‌ కొనసాగింపుపై సుప్రీం

దిల్లీ: సస్పెండైన మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ రామకృష్ణతో తాను సంభాషణ జరిపినట్టు జస్టిస్‌ ఈశ్వరయ్య అంగీకరించినట్టు అఫిడవిట్‌ దాఖలు చేసినందున అందులోని వాస్తవాల నిర్ధరణకు విచారణ అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. వారిద్దరి మధ్య సంభాషణలో వాస్తవాల నిర్ధరణకు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.వి. రవీంద్రన్‌తో విచారణ కమిటీ వేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. దానిని సవాల్‌ చేస్తూ జస్టిస్‌ ఈశ్వరయ్య ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. ‘‘వారిద్దరి మధ్య సంభాషణలో వాస్తవాల నిర్ధరణకు ఓ నివేదిక సమర్పించాలని హైకోర్టు జస్టిస్‌ ఆర్‌.వి రవీంద్రన్‌కు విజ్ఞప్తి చేసింది. మా ఇద్దరి మధ్య సంభాషణ కొనసాగిందని ఒప్పుకుంటూ పిటిషనర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయడంతో పాటు దాని ఇంగ్లిషు అనువాదాన్ని సుప్రీంకోర్టుకు సమర్పించారు. సంభాషణ కొనసాగిందని పిటిషనరే ఒప్పుకుందన్నందున విచారణ అవసరం లేదు. ఒకవేళ విచారణ అవసరమని హైకోర్టు భావిస్తే పిటిషనర్‌కు వాదన వినిపించేందుకు అవకాశం ఇచ్చిన తర్వాత దానిపై ఉత్తర్వులు వెలువరించాలి. హైకోర్టులో దాఖలైన కేసుపై మేము ఎటువంటి నోటీసులు జారీ చేయడం లేదు. ఆ కేసులోని మెరిట్స్‌పై వ్యాఖ్యలు చేయడం లేదు. పిల్‌ కొనసాగింపు (మెయిన్‌టైనబిలిటీ)పై హైకోర్టు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు’’ అని తీర్పులో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని