Supreme Court: కొలీజియం మీటింగ్‌ విషయాలు బయటపెట్టం.. : సుప్రీంకోర్టు

న్యాయ మూర్తుల నియామకంపై కొలీజియం (collegium) సమావేశాల్లోని చర్చల వివరాలను వెల్లడించాలంటూ దాఖలైన పిటిషిన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Updated : 09 Dec 2022 13:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: న్యాయ మూర్తుల నియామకాలపై కొలీజియం (collegium)సమావేశాల్లోని చర్చల వివరాలను వెల్లడించాలంటూ దాఖలైన పిటిషిన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. ఆ వివరాలను బహిర్గతం చేయలేమని పేర్కొంది. ‘‘అక్కడ (కొలీజియం సమావేశంలో) ఏం చర్చంచుకున్నా.. వాటిని బహిర్గతం చేయలేం. కేవలం ఆ సమావేశం తుది నిర్ణయాన్ని మాత్రమే వెల్లడిస్తాం’’ అని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. నాటి సమావేశంలో పాల్గొన్న ఓ న్యాయమూర్తి ఇచ్చిన ఇంటర్వ్యూ ఆధారంగా వెలువడ్డ కథనాలపై పిటిషనర్‌ ఆధారపడ్డారని కోర్టు పేర్కొంది. తాము ఈ ఆంశంపై మరోసారి వ్యాఖ్యానించదల్చుకోలేదని.. ఈ పిటిషన్‌లో పసలేదని తెలిపింది. దీనిని కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.

ఇద్దరు న్యాయమూర్తుల నియామకం కోసం 2018 డిసెంబర్ 12వ తేదీన జరిగిన కొలీజియం (collegium) సమావేశంలో వివరాలను వెల్లడించాలని కోరుతూ సామాజిక కార్యకర్త అంజలీ భరద్వాజ్‌ కోర్టును ఆశ్రయించారు. ఆమె తొలుత ఆర్‌టీఐ చట్టం కింద ఈ వివరాలు కోరగా.. సంబంధిత అధికారులు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమె న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. 2018 డిసెంబర్ 12వ తేదీ నాటి కొలీజియం(collegium) సమావేశంలో సీజేఐ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌, జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ ఎన్వీ రమణ పాల్గొన్నారు. కానీ, అప్పట్లో ఈ భేటీ వివరాలను సుప్రీం కోర్టు (Supreme Court) వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయలేదు. ఆ తర్వాత 2019లో ఆ భేటీ వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచకపోవడంపై జస్టిస్‌ లోకూర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని