EWS: ఈడబ్ల్యూఎస్‌లను ఇతర చర్యలతో పైకి తీసుకురావచ్చు.. రిజర్వేషన్లకు వేరే అర్థం ఉంది: సుప్రీంకోర్టు

అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలను (ఈడబ్ల్యూఎస్‌లను) పైకి తీసుకువచ్చేందుకు విద్య, ఉద్యోగ రంగాల్లో 10% కోటా కల్పించే బదులు ఉపకారవేతనాలు ఇవ్వడం వంటి వివిధ ఇతర చర్యల్ని

Updated : 23 Sep 2022 07:21 IST

అవి అణచివేతకు గురవుతున్నవారి కోసం: సుప్రీంకోర్టు

దిల్లీ: అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలను (ఈడబ్ల్యూఎస్‌లను) పైకి తీసుకువచ్చేందుకు విద్య, ఉద్యోగ రంగాల్లో 10% కోటా కల్పించే బదులు ఉపకారవేతనాలు ఇవ్వడం వంటి వివిధ ఇతర చర్యల్ని చేపట్టవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. రిజర్వేషన్‌ అనే పదానికి సామాజిక, ఆర్థిక సాధికారత వంటి భిన్నమైన సహజార్థాలు ఉన్నాయని తెలిపింది. ఈడబ్ల్యూఎస్‌లకు రిజర్వేషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం విచారణ కొనసాగించింది. ‘‘కులం, వృత్తి వంటి వివిధ కారణాల వల్ల శతాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న వర్గాల కోసం రిజర్వేషన్లను ఉద్దేశించారు. ప్రభుత్వం ఈ అంశం జోలికి వెళ్లకుండానే అగ్రవర్ణాల్లోని పేదలకు ఉచిత విద్య, ఉపకారవేతనాలు వంటి సదుపాయాలు కల్పించవచ్చు. పేదరికం శాశ్వతమైనది కాదు. వెనుకబాటుతనం తాత్కాలికమైనది కాదు. అది అనేక తరాలు, శతాబ్దాల నాటిది. ఆర్థికంగా వెనుకబడడం తాత్కాలికం కావచ్చు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

కోటాను సమర్థించిన కేంద్రం
కేంద్ర సర్కారు తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదించారు. జనరల్‌ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్‌లకు 10% కోటా కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేయడాన్ని సమర్థించుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తున్న 50% రిజర్వేషన్లకు భంగం కలిగించకుండానే పార్లమెంటు ఈ సవరణ చేసిందనీ, రాజ్యాంగ మూల స్వరూపాన్ని ఉల్లంఘించినట్లు రుజువు చేయకుండా దీనిని కొట్టివేయలేరని చెప్పారు. సాధారణ కేటగిరీలోని పేదలకు ప్రస్తుత రిజర్వేషన్‌ విధానంలో ప్రయోజనం అందడం లేదనీ, అందుకే ప్రత్యేక కోటా కల్పించాల్సి వచ్చిందని వివరించారు. రిజర్వేషన్లు వర్తించని పేదలకు మద్దతుగా నిలవాల్సిన ఆవశ్యకతను ఎవరూ తోసిపుచ్చడం లేదన్నారు. సమగ్ర అధ్యయనం తర్వాతే ఈడబ్ల్యూఎస్‌ కోటాకు రూ.8 లక్షల వార్షికాదాయ పరిమితిని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు. తదుపరి విచారణ ఈ నెల 27న జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని