Surendran Pattel: బీడీ కార్మికుడి నుంచి అమెరికా జడ్జి.. కేరళ వాసి సక్సెస్‌ జర్నీ!

Surendran Pattel Journey: కేరళలో ఒకప్పుడు బీడీ కార్మికుడిగా ఉన్న వ్యక్తి.. ఇప్పుడు అమెరికాలో ఉన్నత పదవిని అలంకరించారు. పూటకు లేని రోజుల్లో సాయం కోరే స్థాయి నుంచీ నలుగురికీ న్యాయం అందించే ఎత్తుకు ఎదిగారు. ఆయనే సురేంద్రన్‌. ఆయనదే ఈ కథ.

Updated : 06 Jan 2023 17:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్కూల్‌కెళ్లే రోజుల్లోనే కూలీగా అవతారం. పొట్ట నింపుకోవడానికి చదువుతూనే బీడీలు చుట్టే పని. తోటివారి సాయం చేయకపోతే చదువు కొనసాగించలేని పరిస్థితి. ఇదంతా గతం. సీన్‌ కట్‌ చేస్తే.. లాయర్‌గా మంచి పేరు. సుప్రీంకోర్టులోనూ పనిచేసిన అనుభవం. ఇప్పుడు అమెరికాలో జుడీషియల్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు. అచ్చం సినిమా కథను తలపించే ఈ కథ సురేంద్రన్‌ కె పటేల్‌ది. కేరళకు చెందిన ఈయన ఇటీవలే అమెరికాలో జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆయన జర్నీ గురించి ఓ మ్యాగజైన్‌ కథనం ప్రచురించింది. ఆ మ్యాగజైన్‌తో ఆయన పలు విషయాలు పంచుకున్నారు. చిన్నతనం నుంచి అమెరికా వరకు సాగిన ప్రయాణాన్ని అందులో వివరించారు.

సురేంద్రన్‌ది కేరళలోని కాసర్‌గోడ్‌. రోజువారీ కూలీ కుటుంబంలో జన్మించారు. ఇంటిల్లిపాదీ పనిచేస్తే గానీ గడవని పరిస్థితి. దీంతో సురేంద్రన్‌ కూడా చిన్నతనం నుంచే పని చేసేవారు. సోదరితో కలిసి బీడీలు చుట్టడానికి వెళ్లేవారు. ఇతర కూలీ పనులూ చేసేవారు. ఇవన్నీ చేస్తూనే చదువుకొనేవారు. అయితే, పదో తరగతి తర్వాత చదువు మానేసి పూర్తిగా బీడీలు చుట్టే పనిలో నిమగ్నమయ్యారు. అలా ఏడాది గడిచింది. పనిచేయడం ద్వారా ఆదాయం వస్తున్నా.. ఏదో వెలితి. చదువుకోకపోవడం వల్లే ఏదో కోల్పోతున్నానన్న బాధ ఆయనను వేధించింది. దీంతో చదువును తిరిగి కొనసాగించాలని నిర్ణయానికి వచ్చారు. ఓ ప్రభుత్వ కళాశాలలో ప్రవేశం పొందారు. ఓ వైపు చదువుతూనే మరోవైపు కూలి పనికెళ్లడం కొనసాగించారు.

చదువులో ముందుండే సురేంద్రన్‌.. కూలి పనులకెళ్లే క్రమంలో కళాశాలకు ఎక్కువగా సెలవులు పెట్టేవారు. దీంతో హాజరు తక్కువగా ఉండడం వల్ల పరీక్షలు రాయడానికి అనుమతించేది లేదని కళాశాల యాజమాన్యం చెప్పింది. దీంతో అధ్యాపకులను వేడుకోవడంతో చివరికి అనుమతించారని సురేంద్రన్‌ తన ఇంటర్వ్యూలో చెప్పారు. అనూహ్యంగా ఆ పరీక్షల్లో ఆయనే టాపర్‌గా నిలిచారు. ఆ తర్వాత కాలికట్‌ గవర్నమెంట్‌ లా కాలేజీలో చేరారు. అప్పుడూ ఆయనను ఆర్థిక ఇబ్బందులు వేధించాయి. స్నేహితుల సాయంతో మొదటి ఏడాది పూర్తి చేసిన సురేంద్రన్‌.. ఓ హోటల్‌లో పనిచేస్తూ మిగిలిన చదువునూ పూర్తి చేశారు. 1995లో లా డిగ్రీని పూర్తి చేసిన ఆయన.. 1996లో ప్రాక్టీస్‌ మొదలు పెట్టారు. సుప్రీంకోర్టులోనూ ప్రాక్టీస్‌ చేశారు. సీనియర్‌ న్యాయవాదిగా కొన్ని కేసులు వాదించారు.

అమెరికా అలా..

2004లో శుభతో సురేంద్రన్‌కు వివాహం జరిగింది. కొద్ది రోజులకే ఆమెకు అమెరికాలో ఉద్యోగ అవకాశం వరించింది. దీంతో కుటుంబంతో కలిసి హ్యూస్టన్‌కు మారారు. ఆ తర్వాత అక్కడే స్థిరపడిపోయారు. అమెరికా వెళ్లిన రెండేళ్ల తర్వాత టెక్సాస్‌లోని బార్‌ ఎగ్జామ్‌కు సురేంద్రన్‌ హాజరయ్యారు. తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులయ్యారు. తర్వాత అమెరికా చట్టాలను అర్థం చేసుకోవడానికి యూనివర్సిటీ ఆఫ్‌ హ్యూస్టన్‌ లా సెంటర్‌లో ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్‌లో చేరారు. ఇంటర్నేషనల్‌ లాపై దృష్టిపెట్టారు. 2011లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. కుటుంబ, క్రిమినల్‌, కమర్షియల్‌ వంటి వ్యవహారాల కేసులను వాదించేవారు. తర్వాత సొంతంగా ఓ లా సంస్థను నెలకొల్పారు. లాయర్‌గా అక్కడా మంచి పేరు తెచ్చుకున్నారు. 2020లో డెమోక్రటిక్‌ పార్టీ నుంచి జడ్జి పదవి కోసం జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాత్రం విజయం సాధించారు. ప్రచారంలో ప్రత్యర్థి తన యాసను వెక్కిరించినా.. దాన్నే ఆయన ఆయుధంగా మలచుకొన్నారు. ‘ప్రత్యర్థి యాసనే సహించలేని వ్యక్తి.. మంచి న్యాయమూర్తి ఎలా కాగలవు’ అంటూ ఎదురు ప్రశ్నించారు. తద్వారా అందరి హృదయాలనూ గెలుచుకుని డిస్ట్రిక్ట్‌ జడ్జిగా ఎన్నికయ్యారు. ప్రజలకు న్యాయం కలుగుతుందన్న విశ్వాసం కోర్టుల ద్వారా కలిగినప్పుడే న్యాయవ్యవస్థకు ఓ అర్థం ఉంటుందని చెప్పారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని