Suresh Gopi: ‘ఇందిరాగాంధీ మదర్‌ ఆఫ్‌ ఇండియా’.. కేంద్ర మంత్రి సురేశ్‌ గోపీ వ్యాఖ్యలు

Suresh Gopi: భాజపా ఎంపీ, కేంద్ర మంత్రి సురేశ్‌ గోపీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీని మదర్‌ ఆఫ్‌ ఇండియా అని పేర్కొన్నారు.

Updated : 15 Jun 2024 18:49 IST

Suresh Gopi | త్రిశ్శూర్‌: కేరళలోని త్రిశ్శూర్‌ లోక్‌సభ స్థానం నుంచి భాజపా తరఫున ఎన్నికైన సినీ నటుడు సురేశ్‌ గోపి (Suresh Gopi) కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ‘మదర్‌ ఆఫ్‌ ఇండియా’గా అభివర్ణించారు. కేరళకు చెందిన కాంగ్రెస్‌ మాజీ సీఎం కె.కరుణాకరన్‌, మార్క్సిస్టు నేత ఈకే నాయనార్‌లు తన రాజకీయ గురువులుగా పేర్కొన్నారు. మోదీ కేబినెట్‌లో సహాయ మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆయన.. శనివారం త్రిశ్శూర్‌లో పర్యటించారు. కరుణాకరన్‌ స్మారకమైన మురళీ మందిరాన్ని సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

తన గురు సమానులైన కరుణాకరన్‌కు నివాళులర్పించేందుకే ఇక్కడికి వచ్చానని సురేశ్‌ గోపి పేర్కొన్నారు. దీనికి రాజకీయాలను ఆపాదించొద్దని విలేకరులకు సూచించారు. కరుణాకరన్‌తో తనకు మంచి సంబంధాలు ఉండేవని, ఆయన సతీమణి కల్యాణి కుట్టి తనకు తల్లి వంటి వారని పేర్కొన్నారు. మార్క్సిస్టు నేత నాయనార్‌, ఆయన భార్య శారద టీచరన్‌ను సైతం తల్లిదండ్రులతో సమానంగా భావిస్తానని చెప్పారు. కన్నూర్‌లోని నాయనార్‌ నివాసాన్ని ఇటీవలే సందర్శించినట్లు చెప్పారు.

వచ్చే వారమే రైతుల ఖాతాల్లోకి.. పీఎం-కిసాన్‌ నిధులు

ఈసందర్భంగా ఇందిరాగాంధీని మదర్‌ ఆఫ్‌ ఇండియాగా అభివర్ణించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి మూల పురుషుడు కరుణాకరన్‌ అని చెప్పారు. పాలనా విషయాల్లో ఆమె సాహసోపేత నిర్ణయాలు తీసుకునేవారని పేర్కొన్నారు. 2019లోనే మురళీ మందిరాన్ని సందర్శించాలని అనుకున్నానని, రాజకీయ కారణాల వల్ల అప్పట్లో కుదరలేదన్నారు.

త్రిశ్శూర్‌ స్థానం నుంచి సురేశ్‌ గోపి విజయం సాధించారు. సీపీఐ నేత వీఎస్‌ సునీల్‌కుమార్‌పై 74 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. సురేశ్‌ గోపికి 4.12 లక్షల ఓట్లు రాగా, సునీల్‌ కుమార్‌కు 3.37 లక్షల ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ నేత   కె.మురళీధరన్‌కు 3.28 లక్షల ఓట్లు పోలయ్యాయి. సురేశ్‌ గోపి కొనియాడిన కరుణాకరన్‌ తనయుడే ఈ మురళీధరన్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని