Joshimath crisis: జోషిమఠ్‌ విపత్తు వేళ.. సుష్మా స్వరాజ్‌ పాత ప్రసంగం వైరల్‌

జోషిమఠ్‌ విపత్తు వేళ కేంద్ర మాజీ మంత్రి, దివంగత భాజపా నాయకురాలు సుష్మాస్వరాజ్‌ (Sushma Swaraj) పాత వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఉత్తరాఖండ్‌లో అభివృద్ధి పేరుతో ప్రకృతిపై దాడులు జరుగుతున్నాయని అప్పట్లో ఆమె ఆరోపించారు.

Updated : 13 Jan 2023 16:24 IST

దిల్లీ: ఉత్తరాఖండ్‌(Uttarakhand)లో పర్యాటక క్షేత్రమైన జోషిమఠ్‌ (Joshimath)లో భూమి కుంగడం పెను విపత్తుకు దారితీస్తోంది. ఇక్కడ భూమి శరవేగంగా కుంగిపోవడంతో వందలాది ఇళ్లకు పగుళ్లు వచ్చి ప్రమాదకరంగా మారుతోంది. ఈ పరిస్థితికి ఎన్‌టీపీసీ ప్రాజెక్టు కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గతంలో ఉత్తరాఖండ్‌లో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులపై దివంగత నాయకురాలు సుష్మాస్వరాజ్‌ లోక్‌సభలో చేసిన ఓ ప్రసంగం ఇప్పుడు వైరల్‌గా మారింది.

2013 జూన్‌లో ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని కేదార్‌నాథ్‌ (Kedarnath)లో భీకర వరదలు సంభవించి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలకు ఏడాది ముందు జరిగిన ఈ ప్రకృతి విలయం అప్పట్లో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. అప్పట్లో ప్రతిపక్ష హోదాలో ఉన్న భాజపా (BJP).. ఆ ఏడాది సెప్టెంబరులో జరిగిన పార్లమెంట్‌ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తింది. ఆ సమయంలో సుష్మా స్వరాజ్‌ (Sushma Swaraj) ప్రసంగిస్తూ.. ‘‘ఉత్తరాఖండ్‌లో అభివృద్ధి పేరుతో ప్రకృతి, పర్యావరణంపై విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. దాని ఫలితమే కేదార్‌నాథ్ వరదలు. మనం ఎవరి కోసం అభివృద్ధి చేస్తున్నాం ? ఎవరి కోసం మిలియన్‌-బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తున్నాం? వీటి కారణంగా ఏదో ఒక రోజు ప్రకృతి ఉగ్రరూపం దాల్చి.. ప్రతిదాన్నీ నాశనం చేస్తుంది. ఈ విలయం తర్వాత కూడా మనం కళ్లు తెరవకపోతే.. ఇంకెప్పుడు గ్రహిస్తాం?’’ అని అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

జోషిమఠ్‌లో గత కొన్ని రోజులుగా భూమి కుంగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోన్న విషయం తెలిసిందే. భూమి కుంగిపోవడం వల్ల వందలాది ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఇందులో కొన్ని ప్రమాదకర స్థాయికి దిగజారడంతో అధికారులు ప్రజలను అక్కడి నుంచి తరలించి కూల్చివేతలు ప్రారంభించారు. అయితే కొన్ని దశాబ్దాలుగా ఇక్కడే స్థిరపడ్డవారు ఇప్పుడు మరో ప్రాంతానికి తరలివెళ్లాల్సి రావడంతో జోషిమఠ్‌ (Joshimath) ప్రజలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో హైడ్రోఎలక్ట్రిక్‌ ప్రాజెక్టులు సహా రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టింది. వాటి కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందనేది ప్రధాన ఆరోపణ. కాగా.. రెండేళ్ల క్రితం 2021 ఫిబ్రవరిలో జోషిమఠ్‌ (Joshimath)లో మెరుపు వరదలు సంభవించి కనీసం 200 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని