Omicron: మరిన్ని దేశాలకు ఒమిక్రాన్‌ వ్యాప్తి.. బయటపడుతున్న కొత్త వేరియంట్‌ కేసులు

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ మరిన్ని దేశాలకు వ్యాపిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే బోట్స్‌వానా, హాంకాంగ్‌, బెల్జియం, ఇజ్రాయెల్‌లో

Published : 27 Nov 2021 17:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ మరిన్ని దేశాలకు వ్యాపిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే బోట్స్‌వానా, హాంకాంగ్‌, బెల్జియం, ఇజ్రాయెల్‌లో ఈ రకం కేసులు వెలుగుచూడగా.. తాజాగా జర్మనీ, చెక్‌ రిపబ్లిక్‌ దేశాలకూ వ్యాపించింది. తమ దేశంలోకి ఇప్పటికే ఈ వేరియంట్‌ ప్రవేశించినట్లు జర్మనీ మంత్రి ఒకరు శనివారం ట్వీట్‌ చేశారు. అటు చెక్‌ రిపబ్లిక్‌ కూడా కొత్త వేరియంట్ అనుమానిత కేసు గుర్తించినట్లు ప్రకటించింది.

దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్ మ్యుటేషన్లను గుర్తించినట్లు జర్మనీ సామాజిక వ్యవహారాల శాఖమంత్రి కాయ్‌ క్లోస్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఈ వేరియంట్ ఇప్పటికే జర్మనీలోకి ప్రవేశించిందని అన్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని ఐసోలేషన్‌లో ఉంచామని, జీనోమ్ సీక్వెన్సింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతేగాక, గత రెండు వారాల్లో దక్షిణాఫ్రికా నుంచి దేశానికి వచ్చిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకుని ఐసోలేషన్‌లో ఉండాలని కోరారు. 

కొత్త వేరియంట్‌ నేపథ్యంలో విదేశీ ప్రయాణికులపై జర్మనీ ఆంక్షలు విధించింది. దక్షిణాఫ్రికా నుంచి కేవలం జర్మనీ వాసులే తిరిగి స్వదేశానికి వచ్చేందుకు అనుమతినిస్తున్నట్లు తెలిపింది. అలా వచ్చిన వారు తప్పనిసరిగా 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే జర్మనీ సహా ఐరోపా దేశాల్లో కరోనా ఉద్ధృతి పెరిగిన నేపథ్యంలో తాజా వేరియంట్ మరింత భయాందోళనకు గురిచేస్తోంది. జర్మనీలో శనివారం ఒక్కరోజే 67వేలకు పైగా కొత్త కొవిడ్‌ కేసులు బయటపడ్డాయి. 

మరోవైపు దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన విమానాల్లో డజన్ల కొద్దీ కరోనా కేసులు బయటపడుతున్నట్లు ఇప్పటికే నెదర్లాండ్స్‌ వెల్లడించింది. శుక్రవారం ఆ దేశం నుంచి రెండు విమానాలు రాగా.. అందులో 61 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు డచ్‌ అధికారులు తెలిపారు. అయితే వీరికి సోకింది ఒమిక్రాన్‌ వేరియంటా కాదా అన్నది తెలుసుకునేందుకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని