పంజాబ్ సరిహద్దుల్లో ఉగ్ర కలకలం.. పోలీసు స్టేషన్‌పై రాకెట్‌ లాంఛర్‌తో దాడి

పంజాబ్‌ (Punjab) సరిహద్దుల్లోని ఓ పోలీసు స్టేషన్‌పై రాకెట్ లాంఛర్‌తో గ్రనేడ్‌ దాడి జరిగింది. ఈ ఘటన వెనుక సీమాంతర ఉగ్రవాదుల హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Published : 10 Dec 2022 13:15 IST

చండీగఢ్‌: పంజాబ్‌ (Punjab)లోని భారత్‌-పాక్‌ సరిహద్దు (India-Pak Border)లో ఉగ్ర కలకలం రేగింది. సరిహద్దు జిల్లా తరన్‌తరన్‌లోని ఓ పోలీస్‌ స్టేషన్‌పై శుక్రవారం అర్ధరాత్రి దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు రాకెట్ లాంఛర్‌ సాయంతో గ్రనేడ్‌తో దాడి చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీని వెనుక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తరన్‌తరన్‌లోని సర్హలీ పోలీస్‌ స్టేషన్‌పై ఈ దాడి జరిగింది. ఘటన సమయంలో పోలీసు స్టేషన్‌లో కొంతమంది సిబ్బంది ఉన్నారు. హైవే నుంచి ఈ రాకెట్ ప్రొపెల్డ్‌ గ్రనేడ్‌ను ప్రయోగించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ గ్రనేడ్‌ పేలకపోవడంతో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని చెప్పారు. లాంఛర్‌ కారణంగా పోలీసు స్టేషన్‌ స్వల్పంగా ధ్వంసమైంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి తామే కారణమని ఖలిస్థానీ ఉగ్రముఠా ప్రకటించింది. అయితే దీన్ని సెక్యూరిటీ ఏజెన్సీలు ధ్రువీకరించలేదు. దీని వెనుక సీమాంతర ఉగ్రవాదుల హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానిక గ్యాంగ్‌స్టర్లు.. ఉగ్రముఠాలతో కలిసి ఈ దాడికి ప్రయత్నించి ఉండొచ్చని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

సర్హలీ ప్రాంతం.. ఖలిస్థానీ ఉగ్రవాది హర్వీందర్ సింగ్ రిండా స్వస్థలం. అతడు ఇటీవల పాకిస్థాన్‌లో మృతిచెందినట్లు వార్తలు వస్తున్నా.. దానిపై కచ్చితమైన ఆధారాల్లేవు. రిండా.. భారత్‌లో పలు ఉగ్ర కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఈ ఏడాది మే నెలలో ఇదే తరహాలో పంజాబ్‌ పోలీసు ఇంటెలిజెన్స్‌ విభాగ ప్రధాన కార్యాలయంపై జరిగిన రాకెట్‌ ప్రొపెల్డ్‌ గ్రనేడ్‌ దాడిలో ఇతడి హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తాజా ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. తాజా దాడి నేపథ్యంలో రాష్ట్రంలో ఆమ్‌ ఆద్మీ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు