గోరఖ్‌పూర్‌ ఘటన: వైద్యుడు కఫీల్‌ ఖాన్‌పై వేటు.. తప్పుబట్టిన కాంగ్రెస్‌

యూపీ గోరఖ్‌పూర్‌ బీఆర్‌డీ ఆసుపత్రిలోని చిన్న పిల్లల వైద్యుడు డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విధుల నుంచి తొలగించింది.

Published : 11 Nov 2021 18:44 IST

లఖ్‌నవూ/ గోరఖ్‌పూర్‌: యూపీ గోరఖ్‌పూర్‌ బీఆర్‌డీ ఆసుపత్రిలోని చిన్న పిల్లల వైద్యుడు డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విధుల నుంచి తొలగించింది. ఆక్సిజన్‌ అందక 70 మంది చిన్నారులు మృత్యువాత పడిన ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 2017లోనే ఆయనను సస్పెండ్‌ చేయగా.. తాజాగా పూర్తిగా విధుల నుంచి తప్పించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరీ అలోక్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో ఇంతకంటే పూర్తి వివరాలు ఇవ్వలేకపోతున్నట్లు పేర్కొన్నారు.

తనను తొలగించినట్లు వచ్చిన వార్తలపై కఫీల్‌ ఖాన్‌ స్పందించారు. బీఆర్‌డీ మెడికల్‌ కాలేజీ నుంచి తనను తొలగించినట్లు అలోక్‌ కుమార్‌ ఉత్తర్వులు ఇచ్చినట్లు తన దృష్టికి వచ్చిందని, ఉత్తర్వులు ఇంకా తనకు చేరలేదని తెలిపారు. అయినా, తనను తొలగించే అధికారం వారికి లేదని, యూపీపీఎస్సీ (యూపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌) నుంచి ఉత్తర్వులు తీసుకోవాలని చెప్పారు. ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరత కేసులో తనతో పాటు 8 మందిని సస్పెండ్‌ చేయగా.. ఏడుగురిని మళ్లీ విధుల్లోకి తీసుకున్నారని చెప్పారు. విధుల్లో అలసత్వం, అవినీతి వంటి ఆరోపణలపై తనకు కోర్టు క్లీన్‌చిట్‌ ఇచ్చినా తనను విధుల నుంచి పూర్తిగా తొలగించారని చెప్పారు. తనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని, ఒకసారి ఉత్తర్వులు తన చేతికొచ్చాక కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. కఫీల్‌ఖాన్‌ను తొలగించడంపై కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సైతం స్పందించారు. వైద్యుడిని లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని పేర్కొన్నారు. కఫీల్‌ ఖాన్‌ చేసే న్యాయపోరాటంలో కాంగ్రెస్‌ పార్టీ అతడికి అండగా నిలుస్తుందని ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని