
Supreme Court: సెషన్స్దాటి సభ్యుల్ని సస్పెండ్ చేయడం రాజ్యాంగ విరుద్ధం
దిల్లీ: 12 మంది ఎమ్మెల్యేలను మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేయడాన్ని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తప్పుపట్టింది. ఈ చర్య రాజ్యాంగ విరుద్ధం, ఏకపక్షమంటూ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన సస్పెన్షన్ ఆదేశాలను పక్కన పెట్టింది. అప్పటి సమావేశాల వరకే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ‘సెషన్స్ దాటి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం చట్టవిరుద్ధం’ అని శుక్రవారం తీర్పునిచ్చింది.
2021 జులైలో వర్షాకాల సమావేశాల సమయంలో 12 మంది భాజపా ఎమ్మెల్యేలను మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఏడాది పాటు సస్పెండ్ చేశారు. సభా కార్యకలాలపాలకు అడ్డుతగులుతూ, గందరగోళం సృష్టిస్తున్నారని వారిపై ఈ చర్య తీసుకున్నారు. అంతేగాకుండా ఆ సభ్యులు స్పీకర్ క్యాబిన్ వద్దకు వెళ్లి అనుచితంగా ప్రవర్తించారని రాష్ట్ర ప్రభుత్వం విమర్శించింది. అప్పుడు అక్కడ ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్, మరో సీనియర్ నేత చంద్రకాత్ పాటిల్ ఉన్నారని ఆరోపించింది. కానీ ప్రభుత్వ ఆరోపణల్ని ఫడణవీస్ అవాస్తవాలంటూ తోసిపుచ్చారు.