Maharashtra: సముద్రతీరంలో ఆయుధాలతో పడవ గుర్తింపు.. హై అలర్ట్‌ ప్రకటించిన పోలీసులు

మహారాష్ట్ర సముద్ర తీరంలో ఏకే-47 రైఫిళ్లు ఉన్న పడవ ఒకటి కలకలం రేపుతోంది.

Updated : 18 Aug 2022 18:56 IST

ముంబయి: మహారాష్ట్ర సముద్ర తీరంలో ఏకే-47 రైఫిళ్లు ఉన్న పడవ ఒకటి కలకలం రేపుతోంది. రాయ్‌గఢ్‌లోని హరిహరేశ్వర్ బీచ్ ప్రాంతంలో ఈ అనుమానాస్పద పడవను  గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. దానిలో పేలుడు పదార్థాలు, బుల్లెట్లు, ఆయుధాల విడిభాగాలున్నాయని చెప్పారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు.. చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రత పెంచారు. దీనిపై విచారణ జరుపుతున్నారు.
 
దీనిపై రాయ్‌గఢ్‌ ఎమ్మెల్యే స్పందించారు. ‘రేపు దహీ హండీ జరుపుకోనున్నాం. పది రోజుల్లో గణేశ్‌ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ పండగల వేళ ప్రజలు ఇక్కడికొస్తారు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాను’ అని చెప్పారు. ఈ పడవను గుర్తించిన ప్రాంతం ముంబయికి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. 170 కిలోమీటర్ల దూరంలో పుణె నగరం ఉంది. కాగా, ఈ ఏడాది జూన్‌లో పడవలోని సిబ్బందిని ఒమన్ తీరంలో రక్షించినట్లు అధికారులు చెప్పారు. మనుషులు ఎవరూ లేని ఈ పడవ రాయ్‌గఢ్‌ తీరానికి కొట్టుకువచ్చినట్లు తెలుస్తోంది. దీనిని కొందరు స్థానికులు గుర్తించి, భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు.

ఆ పడవ ఆస్ట్రేలియా వ్యక్తిది: ఫడణవీస్‌

మహారాష్ట్ర తీరంలో గుర్తించిన పడవపై ఆ రాష్ట్ర హోం మంత్రి దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు. ‘ఇప్పటివరకూ ఎలాంటి ఉగ్రకోణాన్ని గుర్తించలేదు. దర్యాప్తు జరుగుతోంది. ఈ చిన్న విషయాన్ని వదిలిపెట్టం. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా.. నేను కేవలం ప్రాథమిక సమాచారం మాత్రం వెల్లడించాను. అయితే పడవలో ఆయుధాలు ఎందుకు ఉన్నాయో చెప్పలేం. దానిపై  దర్యాప్తు జరుగుతోంది. మేం కేంద్ర దర్యాప్తు సంస్థలను సంప్రదిస్తున్నాం. వారు సమాచారాన్ని ధ్రువీకరించారు. ఈ పడవ పేరు లేడీ హాన్‌. ఇది హనా లాండర్‌గన్‌ పేరు మీద ఉంది. ఆమె ఆస్ట్రేలియా వాసి. ఆమె భర్త జేమ్స్ హార్బర్ట్ దీనికి కెప్టెన్‌గా ఉన్నారు. జూన్‌ 26న వాస్తవంగా ఇది మస్కట్ మీదుగా ఐరోపాకు బయలుదేరింది. అయితే  దీని ఇంజిన్‌లో సమస్య రావడంతో పడవలోని సిబ్బందిని మాత్రం రక్షించారు. దీనిని బయటకు లాగలేక వదిలేయడంతో, అది కొట్టుకొని, హరిహరేశ్వర్ తీరానికి చేరుకుందని వెల్లడించారు.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని