Swami Sivananda: మోదీకి పాదాభివందనం చేసి.. పద్మశ్రీ అందుకున్న 125ఏళ్ల యోగా గురువు

రాష్ట్రపతి భవన్‌లో 2022 సంవత్సరానికి గానూ పద్మ పురస్కారాల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. సోమవారం పలువురు గ్రహీతలకు పద్మ అవార్డులను రాష్ట్రపతి రామ్‌నాథ్‌

Updated : 22 Mar 2022 12:33 IST

దిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో 2022 సంవత్సరానికి గానూ పద్మ పురస్కారాల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. సోమవారం పలువురు గ్రహీతలకు పద్మ అవార్డులను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రదానం చేశారు. ప్రముఖ యోగా గురువు, 125 ఏళ్ల స్వామి శివానంద పద్మశ్రీ అందుకున్నారు. తెల్లని ధోవతి, కుర్తా ధరించి.. కాళ్లకు చెప్పులు లేకుండా అత్యంత సామాన్యంగా వచ్చి ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. 

దర్బార్‌ హాల్‌లో స్వామి శివానంద పేరు పిలవగానే ఆయన వచ్చి మొదట ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పాదాభివందనం చేశారు. శివానందకు కూడా ప్రధాని కిందకు వంగి ప్రతి నమస్కారం చేశారు. ఆ తర్వాత రాష్ట్రపతి చెంతకు వెళ్లి ప్రథమ పౌరుడికి కూడా పాదాభివందనం చేయడంతో హాలులో ఉన్నవారంతా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజుతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తూ స్వామి శివానందను కొనియాడారు. ‘హృదయాన్ని హత్తుకునే వీడియో’’ అని రిజిజు రాసుకొచ్చారు. 

1896 ఆగస్టు 8న అవిభాజ్య భారత్‌లోని సిల్హెత్‌(ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది) జిల్లాలో నిరుపేద కుటుంబంలో స్వామి శివానంద జన్మించారు. ఆరేళ్ల వయసులోనే శివానంద తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో ఆయన పశ్చిమ బెంగాల్‌లోని ఓ ఆశ్రమంలో పెరిగారు. గురు ఓంకారానంద గోస్వామి ఆయనను పెంచి పెద్ద చేయడమేగాక, యోగా వంటి ఆధ్యాత్మిక విషయాలను బోధించారు. ఈ క్రమంలోనే తన జీవితాన్ని సమాజసేవకు అంకితం చేసిన స్వామి శివానంద.. గత 50 ఏళ్లుగా పూరీలో 400-600 కుష్ఠు రోగులకు సేవ చేస్తున్నారు. 

నిత్యం యోగా సాధన చేసే స్వామి శివానంద 125 ఏళ్ల వయసులోనూ ఎంతో చలాకీగా, ఆరోగ్యంగా ఉన్నారు. ఇటీవల కరోనా రెండు డోసుల టీకా తీసుకున్న అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డు సాధించడమే గాక, ఇతరులు కూడా వ్యాక్సిన్‌ తీసుకునేలా స్ఫూర్తి కలిగించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని