స్విగ్గీ, జొమాటో ఏజెంట్లకు కొత్త కష్టం.. దిల్లీలో భారీగా ఫైన్లు వేస్తున్న అధికారులు

Swiggy, Zomato Agents: దిల్లీలో స్విగ్గీ, జొమాటో ఏజెంట్లకు భారీ చలాన్లు విధిస్తున్నారు. బైక్‌ ట్యాక్సీలపై ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులు దీనికి కారణమైంది.

Published : 02 Mar 2023 01:17 IST

దిల్లీ: దేశ రాజధాని నగరం దిల్లీలో ఫుడ్‌ డెలివరీ సంస్థలు స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato) ఏజెంట్లకు కొత్త కష్టం వచ్చి పడింది. బైక్‌ ట్యాక్సీలపై నిషేధం విధిస్తూ దిల్లీ సర్కారు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులు వీరి పాలిట తలనొప్పిగా మారాయి. వీరి వాహనాలను సైతం బైక్‌ ట్యాక్సీలుగా పేర్కొంటూ ఆర్‌టీఓ అధికారులు వీరికి భారీగా చలాన్లు వేస్తున్నారు. దీంతో ఆయా ఫుడ్‌ డెలివరీ కంపెనీలు దిల్లీ సర్కారుకు ఫిర్యాదు చేశాయి. దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరాయి.

దిల్లీలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం విధిస్తూ దిల్లీ రవాణా శాఖ ఉత్తర్వులు వెలువరించిన సంగతి తెలిసిందే. ద్విచక్ర వాహనాలను కమర్షియల్‌ అవసరాలకు వినియోగించడం మోటారు వాహనాల చట్టం, 1988ను ఉల్లంఘించడమే అవుతుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. బైక్‌ ట్యాక్సీలు నడపకుండా ఓలా, ఉబర్, ర్యాపిడోపై నిషేధం విధించింది. నిబంధనలు అతిక్రమిస్తే భారీగా ఫైన్లు వేస్తామని ప్రకటించింది. రవాణా శాఖ ఉత్తర్వులకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న వారిపై చలాన్లు విధిస్తున్నారు.

అయితే, తమ వాహనాలకు సైతం ఆర్‌టీఓ అధికారులు చలాన్లు వేస్తున్నారంటూ స్విగ్గీ, జొమాటో సంస్థలు దిల్లీ సర్కారుకు ఫిర్యాదు చేశాయి. బైక్‌ ట్యాక్సీగా భావించి తమ ఏజెంట్‌ ఒకరికి రూ.15వేలు ఫైన్‌ వేశారని స్విగ్గీ పేర్కొంది. ఇటీవలి ఇచ్చిన ఉత్తర్వులు గందరగోళానికి దారితీశాయని, దీంతో ఫుడ్‌/ క్విక్‌ కామర్స్‌ డెలివరీ ఏజెంట్లకు ఆటంకంగా మారిందని తెలిపింది. డెలివరీ చేసేందుకు తమ ఏజెంట్లు వెనకాడుతున్నారని స్విగ్గీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు తప్పుగా అర్థం చేసుకున్నారని, దీనిపై వెంటనే స్పష్టత ఇవ్వాలని జొమాటో ప్రతినిధి ఒకరు ప్రభుత్వాన్ని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు