పొరపాటుగా చొరబాటు.. అదీ మూడుసార్లు

లీచెన్‌స్టైన్‌.. యూరప్‌లో ఓ చిన్న దేశం. 62 చదరపు మైళ్ల విస్తీర్ణంతో తక్కువ జనాభా కలిగి ఉన్న ఈ దేశం సంపన్న దేశాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇక్కడ నేర ఘటనలు చాలా తక్కువగా జరుగుతుంటాయి. సొంత సైన్యం కూడా లేదు. ఇతర దేశాలతో సత్సంబంధాలున్న లీచెన్‌స్టైన్‌లోకి

Updated : 15 Sep 2020 09:35 IST

లీచెన్‌స్టైన్‌.. యూరప్‌లో ఓ చిన్న దేశం. 62 చదరపు మైళ్ల విస్తీర్ణం. అతి తక్కువ జనాభా. ప్రపంచంలోని సంపన్న దేశాల్లో ఒకటి. ఇక్కడ నేరాలు సంఖ్య చాలా తక్కువ. సొంత సైన్యం కూడా లేదు. ఇతర దేశాలతో లీచెన్‌స్టైన్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. అలాంటి దేశంలోకి పొరుగున ఉన్న స్విట్జర్లాండ్‌ గతంలో మూడుసార్లు చొరబడింది. అయితే అవన్నీ పొరపాటుగా జరగడం విశేషం.

క్షిపణి ప్రయోగం.. అడవి దగ్ధం

1985 డిసెంబర్‌ 5న స్విట్జర్లాండ్‌ క్షిపణులను ప్రయోగించడంలో సైనికులకు శిక్షణ ఇచ్చింది. ఈ క్రమంలో సైన్యం ఓ క్షిపణిని పొరపాటున లీచెన్‌స్టైన్‌లోని ఓ అటవీ ప్రాంతంపై ప్రయోగించింది. దీంతో అక్కడ భారీ అగ్నిప్రమాదం జరిగి.. అడవి మొత్తం దగ్ధమైంది. ఈ ఘటనపై లీచెన్‌స్టైన్‌ ఆగ్రహం వ్యక్తం చేయగా.. పొరపాటుకు స్విట్జర్లాండ్‌ భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించింది. 

తమది కాని ప్రాంతంలో శిబిరం ఏర్పాటు

1992 అక్టోబర్‌ 13న ట్రీసెస్‌బర్గ్‌లో సైనిక శిబిరం ఏర్పాటు చేయాలని సైన్యానికి స్విట్జర్లాండ్‌ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో సైనికులు భారీగా ఆయుధాలతో అక్కడి చేరుకొని సైనిక శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి ట్రీసెన్‌బర్గ్‌ ప్రాంతం లీచెన్‌స్టైన్‌ పరిధిలోకి వస్తుంది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన స్విట్జర్లాండ్‌  ప్రభుత్వం లీచెన్‌స్టైన్‌కి క్షమాపణ చెప్పి సైన్యాన్ని వెనక్కి పిలుపించుకుంది. 

దారి తప్పి.. క్షమాపణ చెప్పి

2007 మార్చి 1న మూడోసారి చొరబాటు జరిగింది. స్విట్జర్లాండ్‌కు చెందిన 171 మంది సైనికుల బృందం వారి శిబిరం వైపు వెళ్తుండగా.. ప్రతికూల వాతావరణం, భారీ వర్షం కారణంగా పొరపాటున దేశ సరిహద్దు దాటి లీచెన్‌స్టైన్‌లోకి అడుగుపెట్టారు. ఆ దేశంలో రెండు కిలో మీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత వారి పొరపాటు తెలుసుకొని తిరిగి వెనక్కి వచ్చారు. అయితే లీచెన్‌స్టైన్‌ ప్రభుత్వానికి సైనికులు చొరబాటు గురించి స్విట్జర్లాండ్‌ చెప్పేవరకు తెలియదట. పొరపాటుకు మన్నించాలని స్విట్జర్లాండ్‌ క్షమాపణ కోరగా.. ‘‘ఇదేమీ దండయాత్ర కాదుగా.. ఫర్వాలేదు, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి’ అని లీచెన్‌స్టైన్‌ ప్రభుత్వ ప్రతినిధులు వ్యాఖ్యానించారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని