Modi: మోదీ ‘తాడాసనం’ చూశారా.. తన గ్రాఫిక్‌ వీడియో షేర్ చేసిన ప్రధాని

అంతర్జాతీయ యోగా దినోత్సవం సమీపిస్తోన్న తరుణంలో ప్రధాని మోదీ(Modi) ఒక వీడియోను షేర్ చేశారు. 

Published : 13 Jun 2024 10:41 IST

దిల్లీ: ఉరుకులు పరుగుల జీవితం, విద్యార్థుల్లో ర్యాంకుల కోసం పోటీతత్వం, ఉద్యోగులు కంప్యూటర్‌ ముందు సుదీర్ఘ సమయం కూర్చొనే ఉండటం వంటి పలు కారణాలు జీవనశైలి ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. వాటి నుంచి బయటపడటానికి యోగాసనాలు చక్కని పరిష్కారమని నిపుణులు చెప్తుంటారు. భారత ప్రధాని నరేంద్రమోదీ (Modi) తన జీవితంలో యోగాకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తుంటారు. దేశ ప్రజల దానిని తమ జీవితంలో భాగం చేసుకునేలా సూచనలు చేస్తుంటారు. త్వరలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించుకోనున్న తరుణంలో ఎక్స్‌ ఖాతాలో వీడియోను షేర్‌ చేశారు.

ఆ వీడియో క్లిప్‌లో తాడాసనం(Tadasana) గురించి వివరణ ఉంది. మోదీని పోలిన గ్రాఫిక్‌ ఇమేజ్‌ ఆ ఆసనం ఎలా వేయాలో చూపిస్తోంది. దానివల్ల కలిగే ప్రయోజనాలు చిత్రాల రూపంలో మనం చూడొచ్చు. ‘‘ఇది శరీరానికి ఎంతో మంచిది. శరీర భాగాల స్థితిని ఒకక్రమంలో ఉంచడంలో ఉపకరిస్తుంది’’ అని ప్రధాని ఆ వీడియోకు ఒక వ్యాఖ్యను జత చేశారు. ఈ ఆసనం.. శరీరాకృతిని మెరుగు పరుస్తుంది. ఛాతి భాగం, వెన్నెముకను దృఢపరుస్తుంది. ఏకాగ్రత పెంపునకు ఉపకరిస్తుంది. ఒత్తిడిని అధిగమించవచ్చు. నాడీమండలాన్ని మరింత బలోపేతం చేస్తుంది. కాలి మడమలు, తొడకండరాలు దృఢంగా అవుతాయి. ఎత్తు పెరగాలనుకునే పిల్లలకు ఇది చక్కటి ఆసనమంటారు.

ప్రతిఏటా జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం జూన్‌ 21ని యోగా దినోత్సవంగా నిర్వహించాలని ఐరాసలో భారత్‌ ప్రతిపాదించింది. దానికి అన్ని దేశాలు ముక్తకంఠంతో ఆమోదం తెలిపాయి. ‘‘యోగాతో శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నామన్న భావన కలుగుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతాం. భావోద్వేగాలను కట్టడి చేయగలం. యోగా ఒక జీవన విధానం. ఇతరులు, ప్రకృతి పట్ల ప్రేమభావంతో స్వీయ క్రమశిక్షణ కలిగి ఉంటాం’’ అంటూ దాని వల్ల కలిగే లాభాలను మోదీ ఓ సందర్భంలో వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని