Taiwan issue: తైవాన్‌లో ఉద్రిక్తతలపై స్పందించిన భారత్‌

చైనా-తైవాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిణామాలపై భారత్‌ తొలిసారి స్పందించింది. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ ......

Published : 12 Aug 2022 22:31 IST

దిల్లీ: చైనా-తైవాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిణామాలపై భారత్‌ తొలిసారి స్పందించింది. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ పర్యటన నేపథ్యంలో అక్కడ జరుగుతున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తంచేసింది. సంయమనం పాటించాలని చైనా, తైవాన్‌లకు పిలుపునిచ్చింది. తైవాన్‌లో యథాతథ స్థితిని మార్చేందుకు ఏకపక్ష చర్యలు మంచిది కాదంది. నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన డ్రాగన్‌.. అందుకు ప్రతిగా తైవాన్‌ చుట్టూ భారీ ఎత్తున సైనిక విన్యాసాలు కొనసాగిస్తుండటంతో కొన్ని రోజులుగా తైవాన్ జలసంధి వద్ద తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తైవాన్‌లో పరిస్థితులపై భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి మీడియాతో మాట్లాడారు. తైవాన్‌లో పరిస్థితులపై ఇతర దేశాల్లాగే భారత్‌ కూడా ఆందోళన వ్యక్తంచేస్తోందన్నారు. చైనా-తైవాన్‌ సంయమనం పాటించాలని, తైవాన్‌లో యథాతథ స్థితిని మార్చేందుకు ఏకపక్ష చర్యలు నివారించాలన్నారు. ఉద్రిక్తతలు నివారించి ఆ ప్రాంతంలో శాంతి, సుస్థిరత కొనసాగేలా తగిన చర్యలు తీసుకోవాలని భారత్‌ కోరుకుంటోందన్నారు. ఇలాంటి విషయాల్లో భారత్‌ విధానాలు సుప్రసిద్ధమైనవి, స్థిరమైనవన్న బాగ్చి.. వాటిని మళ్లీమళ్లీ చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని