Updated : 10 Mar 2021 13:07 IST

డ్రాగన్‌ ‘పైనాపిల్‌ యుద్ధ ప్రకటన’..!

 ప్రతిదాన్ని ఆయుధీకరిస్తున్న చైనా..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: చైనాపై ఆధారపడటం అంటే చేతులు కట్టేసుకోవడమే.. అదేమి చేసినా చూస్తూ ఊరుకోవాల్సిందే. ఎదుటివారి ప్రతి బలహీనతను చైనా ఆయుధంగా మలచుకొని దాడి చేస్తుంది. వ్యాపారం, పరపతి, రుణాలు, సైన్యం, ఆయుధాలు ఇలా ఏది దొరికితే దానిని వాడుకుంటుంది. ఈ విషయం కొవిడ్‌ విజృంభణ సమయంలో పలుమార్లు రుజువైంది. ఇప్పుడు తాజాగా మరో ఉదాహరణ ప్రపంచం ముందుకొచ్చింది. చైనా దుందుడుకు చర్యలను ఎదుర్కొని నిలబడిన ఓ చిరు దేశంపై ప్రతాపం చూపిస్తోంది. ఆ దేశమే తైవాన్‌..!

తైవాన్‌ను ఆక్రమించుకోవాలని చైనా కొన్నేళ్లుగా కలలుగంటోంది. ఇక చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అజెండాలో అది ప్రముఖ స్థానంలో ఉంది. కానీ, తైవాన్‌కు అమెరికా మద్దతు లభిస్తుండటంతో ఏమీ చేయలేక గుర్రుగా చూస్తోంది. ఈ వివాదాన్ని పక్కనపెడితే తైవాన్‌-చైనా మధ్య సాంస్కృతిక, వ్యాపార సంబంధాలు బలంగానే ఉన్నాయి. తైవాన్‌ సంస్థలు చైనాలో పెట్టుబడులు పెట్టి కర్మాగారాలను నిర్మించాయి. అదేవిధంగా తైవాన్‌లో ఉత్పత్తి అయ్యే పైనాపిల్‌కు చైనాయే అతిపెద్ద మార్కెట్‌. 2020 ఒక్క సంవత్సరంలోనే 41వేల టన్నులకు పైగా పైనాపిల్స్‌ను  చైనాకు ఎగుమతి చేసింది. వీటివిలువ 52.64 మిలియన్ డాలర్లు. తైవాన్‌లో ఉత్పత్తి అయ్యేదానిలో 91శాతానికి ఇది సమానం. అంటే తైవాన్‌ ఈ విషయంలో చైనాపై ఆధాపడుతోందన్నమాట. ఇప్పుడు చైనా దాన్ని ఆయుధంగా మలుచుకొంది. గత ఫిబ్రవరి నుంచి తైవాన్‌ నుంచి చైనాకు పైనాపిల్స్‌ ఎగుమతులను నిలిపివేసింది.  వైరస్‌ వ్యాప్తి భయాలను సాకుగా చూపింది. చాలా చిన్న ద్వీపమైన తైవాన్‌లోని రైతులు ఒక్కసారిగా ఒత్తిడికి గురయ్యారు.  ఈ క్రమంలో ఆస్ట్రేలియా, జపాన్‌, సింగపూర్‌, వియత్నాం, మధ్యప్రాశ్చ్యంలోని దేశాలు తైవాన్‌కు అండగా నిలిచాయి. ఈ విషయాన్ని తైవాన్‌ ఉపాధ్యక్షుడు లీ చింగ్‌తే ట్విటర్లో పేర్కొన్నారు. తైవాన్‌ పైనాపిల్స్‌ దిగుమతికి తాము అనుమతిస్తున్నామని ఆస్ట్రేలియా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కామర్స్‌ ఓ ప్రకటనలో తెలిపింది. 

గతంలో ఫిలిప్పీన్స్‌తో ‘బనానా వార్‌’..

చైనాకు ఇలా చేయడం కొత్తేమీ కాదు. గతంలో పొరుగుదేశమైన ఫిలిప్పీన్స్‌తో అరటిపండ్ల యుద్ధం చేసింది. దక్షిణ చైనా సముద్రం తనదంటూ చైనా ప్రకటించాడాన్ని ఫిలిప్పీన్స్‌ ప్రశ్నించింది.  ఫిలిప్పీన్స్‌ నౌకాదళం చైనా పడవలను అడ్డుకొంది.  దీంతో 2012లో ఇరు దేశాల మధ్య వివాదం రాజుకుంది. ఫిలిప్పీన్స్‌ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనుకుని చైనా ఓ ఎత్తుగడ వేసింది. ఫిలిప్పీన్స్‌ రైతులు పండించే అరటి పండ్లకు చైనానే అతిపెద్ద మార్కెట్‌. దీంతో ఫిలిప్పీన్స్‌ అరటిపండ్ల నాణ్యతకు వంకలు పెట్టి కొనుగోళ్లను తగ్గించింది. వందల కొద్దీ కంటైనర్లను తిప్పి పంపడం మొదలుపెట్టింది. అపరిశుభ్రంగా ఉన్నాయని కొన్నింటిని ధ్వంసం కూడా చేసింది. తర్వాత ఇతర పండ్లను కొనేందుకు కూడా సాకులు చూపడం మొదలుపెట్టింది. దీంతో ఫిలిప్పీన్స్‌లోని కొన్ని లక్షల మంది రైతులు అవస్థలు పడ్డారు. బిలియన్ల కొద్దీ నష్టం వాటిల్లింది. 2016లో తాము అమెరికాకు దూరం అయ్యే అవకాశాలున్నాయని ఫిలిప్పిన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగా డ్యుటెరెట్టి సంకేతాలు ఇవ్వడంతో చైనా శాంతించింది. దిగుమతులను పెంచింది.

ఆసీస్‌పై వైన్‌ యుద్ధం..

కరోనా పుట్టుపూర్వోత్తరాలు కనుగొనాలని డిమాండ్‌ చేసిన ఆసీస్‌ను కూడా చైనా ఇలానే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఆస్ట్రేలియా ఎగుమతులు అత్యధికంగా చైనాకు వెళ్లడాన్ని వాడుకొంది. మొత్తం ఆస్ట్రేలియా ఎగుమతుల్లో 55శాతం చైనాకు వెళతాయి. బొగ్గు, బార్లీ, కాపర్‌, చక్కెర, కలప, వైన్‌ వంటి వాటిని కొన్ని నెలల కిందటి నుంచి అప్రకటిత బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. ఆస్ట్రేలియా నుంచి వచ్చే బొగ్గు నౌకలను అన్‌లోడింగ్‌ చేయనీయకుండా  పోర్టుల్లో నెలల కొద్దీ నిలిపేసింది. జూన్‌-జులై మధ్యలో చైనా చేరుకొన్న నౌకల్ని బొగ్గు అన్‌లోడ్‌ చేయనీయకండా ఆపేసింది. ఆస్ట్రేలియా సంస్థలు కారుచౌకగా వైన్‌ను డంప్‌ చేస్తున్నాయంటూ వైన్‌ తయారీ సంస్థలపై నవంబర్‌లో యాంటీ డంపింగ్‌ ఇన్వెస్టిగేషన్‌ను ప్రారంభించింది. దీంతో డిసెంబర్‌లో అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. వాస్తవానికి ఆసీస్‌లో తయారయ్యే వైన్‌కు చైనానే అతిపెద్ద మార్కెట్‌. 
దక్షిణ కొరియాపై టూరిస్ట్‌లను వినియోగించి..

ఉ.కొరియా వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తుండటంతో దక్షిణ కొరియాకు రక్షణగా అమెరికా థాడ్‌ క్షిపణి రక్షణ వ్యవస్థను పంపించింది. ఇది పక్కనే ఉన్న చైనా దళాల కదలికలను కూడా పసిగట్టగలదు. దీంతో డ్రాగన్‌ దక్షిణకొరియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దక్షిణ కొరియాకు వెళ్లే చైనా యాత్రికుల పర్యటనలను 40శాతం వరకు రద్దు చేయించింది. ప్రపంచ పర్యటాక రంగంలో చైనా యాత్రికులు ఏటా దాదాపు 260 బిలియన్‌ డాలర్లు వెచ్చిస్తారు. దక్షిణ కొరియాకు వెళ్లేవారి సంఖ్య దాంతో సగానికి సగం పడిపోయింది.

వాణిజ్య యుద్ధ సమయంలో రేర్‌ఎర్త్‌ ఖనిజాలను అమెరికాకు ఎగుమతి చేయడాన్ని ఆపేస్తామని చైనా బహిరంగంగానే హెచ్చరించింది. గతంలో రేర్‌ ఎర్త్‌ ఖనిజాల విషయంలో జపాన్‌ను బాగా ఇబ్బంది పెట్టింది కూడా.

భారత్‌ ఎలా తప్పించుకొంది..?

చైనాకు ఎగుమతి చేసే వాటికంటే ఆ దేశం నుంచి భారత్‌ దిగుమతి చేసుకొనేవే ఎక్కువ. ఇది చైనాకు 2020లోనే 45.91 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలో భారత్‌ యాప్స్‌ నిషేధించినా.. పెట్టుబడులపై ఆంక్షలు విధించినా చైనా కిక్కురుమనలేదు. లేకపోతే గల్వాన్‌ ఘటన తర్వాత భారత్‌ను కూడా ఆర్థికంగా వేధించేందుకు మార్గం వేతికేది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని