ఉచిత మీల్స్‌ కోసం.. పేరు మార్చుకుంటున్నారు

పేరు మార్చుకోవడమంటే అంత సులువైన పని కాదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాలి. అందుకే చాలా మంది అత్యవసరమైతే తప్ప పేరు మార్చుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ, తైవాన్‌ ప్రజలు కేవలం ఓ రెస్టారెంట్‌ ఉచితం భోజన

Updated : 20 Mar 2021 06:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పేరు మార్చుకోవడమంటే అంత సులువైన పని కాదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాలి. అందుకే చాలా మంది అత్యవసరమైతే తప్ప పేరు మార్చుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ, తైవాన్‌ ప్రజలు కేవలం ఓ రెస్టారెంట్‌ ఉచితం భోజన ఆఫర్‌ కొట్టేయడం కోసం తమ పేరును మార్చుకుంటున్నారు. తమ పేరులో ‘చేప’ ఉండేలా మార్పులు చేయాలని కోరుతూ ప్రభుత్వ కార్యాలయం వద్ద క్యూ కడుతున్నారు.

తైవాన్‌లోని అకిండో సుషిరో అనే రెస్టారెంట్‌ సుషి(అన్నం.. చేపలు లేదా కూరగాయలతో భోజనం)వంటకాల్లో పాపులర్‌. అయితే, ఇటీవల ఎవరి గుర్తింపు కార్డుల్లో అయితే ‘గీ యూ(సాలమన్‌ చేప)’ పేరు ఉంటుందో వారికి, వారితోపాటు మరో ఐదుగురికి ఉచితంగా భోజనం పెడతామని ప్రకటించింది. దీంతో అక్కడి ప్రజలు తాత్కాలికంగా తమ పేరు చివర ‘గీ యూ’ పేరును జతచేయాలని ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకుంటున్నారు. బావో చెంగ్‌ అనే వ్యక్తి ఇప్పటికే బావో చెంగ్‌ గీ యూగా పేరు మార్చుకొని రెస్టారెంట్‌లో ఉచిత భోజనం లాగించేశాడు. ఇప్పటి వరకు పేరు మార్పు కోసం దాదాపు 200 మంది ప్రభుత్వ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నారట. తైవాన్‌లో ప్రజలకు తమ పేరును మూడుసార్లు మార్చుకునే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని ప్రజలు ఇప్పుడు వినియోగించుకుంటున్నారు. 

అయితే, ప్రజలు తమ పేరు మార్పు నిర్ణయాన్ని మానుకోవాలని ప్రభుత్వ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉచిత భోజనం కోసం పేరు మార్పునకు ఉన్న అవకాశాన్ని దుర్వినియోగం చేయొద్దని కోరుతున్నారు. దీని వల్ల సమయం వృథా అవడమే కాకుండా.. దరఖాస్తులు, పత్రాలు, ఇలా అనవసరమైన పేపర్‌వర్క్‌ ఉంటుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని