Tajinder Bagga: బగ్గాను అరెస్టు చేసి హాజరుపర్చండి.. పంజాబ్ కోర్టు కీలక ఆదేశాలు

నాటకీయ పరిణామాలకు దారితీసిన బీజేవైఎం జాతీయ కార్యదర్శి తజీందర్‌ పాల్‌ సింగ్‌ బగ్గా అరెస్టు వ్యవహారంలో మొహాలీ కోర్టు శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. బెదిరింపులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తదితర ఆరోపణలపై నమోదైన...

Published : 08 May 2022 02:24 IST

చండీగఢ్‌: నాటకీయ పరిణామాలకు దారితీసిన బీజేవైఎం జాతీయ కార్యదర్శి తజీందర్‌ పాల్‌ సింగ్‌ బగ్గా అరెస్టు వ్యవహారంలో మొహాలీ కోర్టు శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. బెదిరింపులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తదితర ఆరోపణలపై నమోదైన కేసుకు సంబంధించి బగ్గాను అరెస్టు చేసి తమ ముందు హాజరుపరచాలని పంజాబ్ పోలీసులను ఆదేశించింది. శుక్రవారం నాటి పరిణామాల నేపథ్యంలో.. పంజాబ్ పోలీసులు శనివారం ఉదయం మొహాలీ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కోర్టు నుంచి అతని అరెస్ట్ వారెంట్‌ పొందారు. ఈ కేసు తదుపరి విచారణ మే 23న జరగనుంది.

దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసం ఎదుట భాజపా యువ విభాగం నేతలు ఇటీవల ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తజీందర్‌ సింగ్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ మేరకు నమోదైన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పంజాబ్‌ పోలీసులు.. శుక్రవారం అతన్ని దిల్లీలో అరెస్టు చేసి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో హరియాణా పోలీసులు అడ్డుకున్నారు. అతన్ని బలవంతంగా తరలిస్తున్నట్లు తమకు ఫిర్యాదు వచ్చిందంటూ తెలిపారు. ఇంతలో దిల్లీలో బగ్గా కిడ్నాప్‌ కేసు నమోదు కావడంతో.. దిల్లీ పోలీసులు రంగప్రవేశం చేసి చివరకు అతన్ని దేశ రాజధానికి తరలించారు.

ఇదిలా ఉండగా.. పంజాబ్‌లో అల్లర్లను ప్రేరేపించిన ఓ గూండాను భాజపా, దాని ప్రభుత్వాలు రక్షించాయని ఆప్‌ నేత, దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా విమర్శించారు. శనివారం ఈ మేరకు ఓ ట్వీట్‌ చేస్తూ.. ‘పంజాబ్‌లో సోదరభావానికి వ్యతిరేకంగా మాట్లాడిన, అల్లర్లను ప్రేరేపించిన గూండాల్లో ఒకరిని రక్షించడంలో మొత్తం భాజపా, దాని ప్రభుత్వాలు నిమగ్నమయ్యాయి. భాజపా గూండాల దళం. తన ప్రభుత్వాల నుంచి కూడా ఆ విధమైన పనులే చేయించుకుంటోంది. ఈ వ్యక్తులు పొరపాటున కూడా విద్య, ఆరోగ్యం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి మాట్లాడరు’ అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని