Bangladesh: బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోండి: బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా

బంగ్లాదేశ్‌లో కొన్ని రోజులుగా మైనార్టీలపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. కొమిల్లా జిల్లాలో దుర్గామాత పూజల వేళ మొదలైన ఈ హింసాత్మక ఘటనలు.. ఆయా ప్రాంతాలకు పాకాయి. రంగ్‌పుర్‌ జిల్లాలో కొందరు దుండగులు ఆదివారం అర్ధరాత్రి అక్కడి మైనార్టీలైన...

Published : 19 Oct 2021 19:47 IST

ఢాకా: బంగ్లాదేశ్‌లో కొన్ని రోజులుగా మైనార్టీలపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. కొమిల్లా జిల్లాలో దుర్గామాత పూజల వేళ మొదలైన ఈ హింసాత్మక ఘటనలు.. ఆయా ప్రాంతాలకు పాకాయి. రంగ్‌పుర్‌ జిల్లాలో కొందరు దుండగులు ఆదివారం అర్ధరాత్రి అక్కడి మైనార్టీలైన హిందూవర్గానికి చెందిన 20 ఇళ్లను తగలబెట్టడమే కాకుండా మరో 66 ఇళ్లను ధ్వంసం చేశారు. మరోవైపు ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తూ, స్థానికంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతుండటంతో.. బంగ్లాదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళవారం నిర్వహించిన కేబినెట్‌ సమావేశంలో ప్రధాని షేక్‌ హసీనా మాట్లాడుతూ.. ఆయా హింసాత్మక ఘటనలకు బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని హోంశాఖ మంత్రి అసదుజ్జమాన్‌ ఖాన్‌కు ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేబినెట్‌ కార్యదర్శి అన్వరుల్‌ ఇస్లాం ఈ సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించారు.

అవామీ లీగ్‌ శాంతి ర్యాలీలు..

భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి.. హోంశాఖకు స్పష్టం చేసినట్లు ఇస్లాం చెప్పారు. మరోవైపు ‘కొమిల్లా’ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, అసలేం జరిగిందనేది త్వరలో తెలుస్తుందన్నారు. అధికార అవామీ లీగ్ పార్టీ సైతం ఇటీవల జరిగిన ఘటనలను ఖండిస్తూ.. మంగళవారం దేశవ్యాప్తంగా మత సామరస్య ర్యాలీలు, శాంతి ఊరేగింపులు నిర్వహించింది. షేక్ హసీనా ప్రభుత్వం.. మైనారిటీ స్నేహపూర్వక ప్రభుత్వమని పార్టీ ప్రధాన కార్యదర్శి ఒబైదుల్ ఖాదర్‌ పేర్కొన్నారు. మతతత్వ శక్తులను కట్టడి చేసేవరకు తాము వీధుల్లోనే ఉంటామని చెప్పారు. మరోవైపు అమెరికా కూడ మైనార్టీలపై దాడులను ఖండించింది. విదేశాంగ శాఖ ప్రతినిధి ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. మత స్వేచ్ఛ, విశ్వాసాలు మానవ హక్కులని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని