Mask: మాస్క్‌ పెట్టుకోకపోతే కఠిన చర్యలు తీసుకోండి: డీజీసీఏ ఆదేశం

దేశంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న వేళ విమానయాన సంస్థలకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ)....

Published : 18 Aug 2022 02:04 IST

దిల్లీ: దేశంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న వేళ విమానయాన సంస్థలకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికులందరూ విమానాల్లో తప్పకుండా మాస్కులు ధరించేలా చూడాలని కోరింది. ఒకవేళ ప్రయాణికుల్లో ఎవరైనా ఆదేశాలను ఉల్లంఘిస్తే విమానం నుంచి దించేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవచ్చని సూచించింది. ప్రయాణం చేసినంత సేపూ మాస్క్‌ పెట్టుకొని తీరాల్సిందేనని స్పష్టంచేసింది. తప్పనిసరి, అత్యవసర పరిస్థితుల్లోనే మాస్క్‌ తీసేందుకు అనుమతించాలని విమానయాన సంస్థలను ఆదేశించింది. విమానాశ్రయాలు, విమానాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్టు తెలిపింది. విమానాశ్రయాల్లో నిఘా పెంచాలని, ఎవరైనా మాస్క్‌ పెట్టుకోకుండా కనబడితే వారికి అనుమతి నిరాకరించాలని సూచించింది. విమానాశ్రయంలోని పలుచోట్ల శానిటైజర్లను ఉంచాలని ఆదేశించింది. 

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ అదుపులో ఉన్నప్పటికీ దిల్లీలో కేసుల సంఖ్య పెరగడంతో పాటు ఆస్పత్రిల్లో చేరికలూ పెరుగుతుండటం కలవరపెడుతోంది. ఈ ఒక్కరోజే దేశంలో 9062 కొత్త కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో అప్రమత్తమైన డీజీసీఏ ఈ మహమ్మారి కట్టడి కోసం విమానయాన సంస్థలకు తాజాగా సూచనలు చేసింది. ప్రయాణికులంతా చేతుల్ని శుభ్రం చేసుకోవడంతో పాటు పలు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని కోరింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని