Corona: జనం ఎందుకలా చేస్తున్నారో తెలియట్లేదు?

దేశానికి థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచి ఉందంటూ నిపుణులు చేస్తున్న హెచ్చరికలను సీరియస్‌గా తీసుకోవాలని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

Published : 20 Jun 2021 01:34 IST

థర్డ్‌వేవ్‌పై హెచ్చరికల్ని సీరియస్‌గా తీసుకోవాలని అజిత్ పవార్‌ విజ్ఞప్తి

పుణె: దేశానికి థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచి ఉందంటూ నిపుణులు చేస్తున్న హెచ్చరికలను సీరియస్‌గా తీసుకోవాలని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మహమ్మారిపై అజాగ్రత్త పనికి రాదని ప్రజలకు సూచించారు. శనివారం ఆయన పుణెలో విలేకర్లతో మాట్లాడారు. కొవిడ్‌ ఆంక్షలను సడలించినప్పటికీ ప్రజలు పర్యాటక ప్రదేశాలను సందర్శించడం మంచిది కాదన్నారు. థర్డ్‌వేవ్‌ను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని సూచించారు. జిల్లా పరిధి దాటి పర్యాటక ప్రదేశాలకు వెళ్లినవారు తిరిగి ఇంటికొచ్చాక 15 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండటం తప్ప వేరే గత్యంతరం లేదని వ్యాఖ్యానించారు. ‘‘ప్రస్తుతం పుణె జిల్లాలో లెవెల్‌ 2 అన్‌లాక్‌ ప్లాన్‌ అమలవుతోంది. కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వారాంతపు రోజుల్లో అత్యవసర దుకాణాలు మినహా మాల్స్‌, హోటళ్లు, రెస్టారెంట్ల మూసివేత కొనసాగుతోంది. ఈ విధానం వచ్చే శని, ఆదివారాల్లోనూ కొనసాగుతుంది. కరోనా పరిస్థితి అదుపులోకి వచ్చాక మరోసారి సమీక్షించి ఈ నిబంధనల్ని ఎత్తివేసే అంశంపై నిర్ణయం తీసుకుంటాం’’ అని వివరించారు. 

వారాంతపు రోజుల్లో మహాబలేశ్వర్‌, లొనవాలా తదితర పర్యాటక ప్రదేశాలకు పెద్ద సంఖ్యలో జనాలు వస్తుండటంపై అజిత్‌ పవార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ ‘‘ప్రజలు ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. కరోనా వ్యాధిని తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనేకమంది ప్రజలు రాష్ట్రాల బయట పర్యాటక ప్రదేశాలకు వెళ్తున్నారు. ఇంకొందరైతే ట్రెక్కింగ్‌కు పోతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే.. జిల్లా నుంచి బయటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి చేరాక, వారికి 15 రోజులపాటు క్వారంటైన్‌ విధించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. దీనిపై ఆదేశాలు ఇచ్చే అవకాశం కూడా ఉంది’’ అని ఆయన అన్నారు.  

మరోవైపు, వ్యాక్సినేషన్‌ భారీగా జరిగిన అమెరికా, ఇంగ్లాండ్‌ వంటి దేశాల్లోనూ థర్డ్‌ వేవ్‌ ముప్పు భయాలు ఎక్కువగానే ఉన్నాయన్నారు. అందువల్ల దీన్ని తీవ్రంగా పరిగణించి దానికనుగుణంగా మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు రెండు డోసులు వేసుకోవాలని కోరారు. పుణెలోని పురందర్‌ తహసీల్‌ పరిధిలోని బహిర్వాడి గ్రామం దేశంలోనే 100శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయిన తొలి గ్రామంగా నిలిచినట్టు ఆయన వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని