
Afghanistan: మహిళలు నటించే షోలు ప్రసారం చేయొద్దు.. తాలిబన్ల హుకుం!
కాబుల్: తాలిబన్ల కబంద హస్తాల్లో అఫ్గానిస్థాన్ వాసులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అడుగడునా ఆంక్షలతో సతమతమవుతున్నారు. ఇప్పటికే అక్కడ మహిళలపై కఠిన ఆంక్షలు, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలపై నిబంధనలు కొనసాగుతున్నాయి. తాజాగా టీవీ షోలపైనా ఆంక్షలు విధించింది తాలిబన్ ప్రభుత్వం. మహిళా నటులు ఉండే షోలు, డ్రామాల ప్రసారాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
అఫ్గాన్ మంత్రిత్వ శాఖ నుంచి అక్కడి మీడియాకు వచ్చిన తొలి అధికారిక ఉత్తర్వులు ఇవి. మహిళా యాక్టర్లు ఉండే కార్యక్రమాలతో పాటు మహ్మద్ ప్రవక్త, ఇతర మత ప్రముఖులను చూపించే సినిమాలు, ప్రోగ్రామ్‌లను ఛానళ్లు ప్రసారం చేయరాదని ఆ దేశ ప్రమోషన్ ఫర్ వర్చ్యూ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ వైస్ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక, మహిళా జర్నలిస్టులు రిపోర్టింగ్ చేసే సమయంలో తప్పనిసరిగా హిజాబ్ ధరించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల వస్త్రధారణపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
2001లో అఫ్గాన్‌లో ప్రజాస్వామ్య పాలన తర్వాత ఆ దేశ మీడియాలో చాలా మార్పులు వచ్చాయి. పాశ్చాత్య దేశాల మద్దతుతో నడిచిన పాలనలో ఎన్నో టీవీ ఛానళ్లు, రేడియో స్టేషన్లు పుట్టుకొచ్చాయి. గత 20 ఏళ్లలో ఈ ఛానళ్లలన్నీ ఎలాంటి అవాంతరాలు లేకుండా అనేక కార్యక్రమాలను స్వేచ్ఛగా ప్రసారం చేశాయి. అమెరికన్ ఐడల్ లాంటి రియాల్టీ షోలతో పాటు పలు విదేశీ షోలు, భారతీయ సినిమా, సీరియళ్లను ప్రసారం చేశాయి. ఇప్పుడు మళ్లీ తాలిబన్ల ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. వాటిపై కొరడా ఝుళిపిస్తోంది. ఇప్పటికే ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించిన తాలిబన్ సర్కారు.. ఇప్పుడు మహిళలు నటించే ప్రోగ్రామ్‌లపై ఆంక్షలు తీసుకొచ్చింది.
దీంతో రెండు దశాబ్దాల కింద ఉన్న తాలిబన్ల అరాచక పాలనే మళ్లీ మొదలైందని ప్రజలు వాపోతున్నారు. గతంలో తాలిబన్లు పాలించిప్పుడు.. టీవీ, సినిమా, ఇతర ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలను అనైతికంగా పేర్కొంటూ వాటిపై నిషేధం విధించారు. టీవీలు చూస్తూ కన్పించినవారికి బహిరంగానే శిక్షలు వేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.