భారత జర్నలిస్టు మృతిపట్ల తాలిబన్ల సంతాపం

అఫ్గానిస్థాన్‌లో ఆ దేశ బలగాలు, తాలిబన్లకు మధ్య జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత్‌కు చెందిన ఫొటో జర్నలిస్టు డానిశ్‌ సిద్ధిఖీ మృతి పట్ల తాలిబన్లు సంతాపం వ్యక్తం చేశారు....

Published : 16 Jul 2021 22:23 IST

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లో ఆ దేశ బలగాలు, తాలిబన్లకు మధ్య జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత్‌కు చెందిన ఫొటో జర్నలిస్టు డానిశ్‌ సిద్ధిఖీ మృతి పట్ల తాలిబన్లు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతితో తమకు సంబంధం లేదని తాలిబన్ల ప్రతినిధి జాబిఉల్లా ముజాహిద్‌ వెల్లడించారు. ‘యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి ఎవరైనా జర్నలిస్ట్‌ వచ్చినట్లయితే ముందుగా వారు మాకు సమాచారం అందించాలి. ఆ వ్యక్తిని జాగ్రత్తగా చూసుకుంటాం. భారత్‌కు చెందిన జర్నలిస్ట్‌ డానిశ్‌ సిద్ధిఖీ మృతి బాధాకరం. ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాం. మాకు సమాచారం ఇవ్వకుండా జర్నలిస్టులు యుద్ధం జరిగే ప్రాంతంలోని రావడం నిజంగా బాధాకరం’ అని ముజాహిద్‌ పేర్కొన్నారు.

కాందహార్‌లోని స్పిన్‌ బొల్డాక్‌ ప్రాంతంలో గల కీలక పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతాన్ని తాలిబన్లు ఇటీవల తమ అధీనంలోకి తీసుకున్నారు. దీంతో గత కొద్ది రోజులుగా తాలిబన్‌, అఫ్గాన్‌ బలగాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. రాయిటర్స్‌ సంస్థలో పనిచేస్తున్న డానిశ్‌ సిద్ధిఖీ ఈ ఘటనలను కవర్‌ చేస్తున్నారు. అయితే గురువారం రాత్రి జరిగిన ఘర్షణల్లో ఆయన మృతిచెందారు. డానిశ్‌ మృతిని భారత్‌కు అఫ్గాన్‌ రాయబారి ఫారిద్‌ మముంజే ట్విటర్‌ వేదికగా ధ్రువీకరించి సంతాపం ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని