
Afghanistan: తాలిబన్ల మరో దుశ్చర్య.. బాలుడి దారుణ హత్య!
కాబుల్: అఫ్గాన్‌లో తాలిబన్ల దురాగతాలకు అంతులేకుండా పోతోంది! తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వారు.. గత పాలనను గుర్తుతెచ్చేలా ఆంక్షలు, కఠిన శిక్షలతో పౌరులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల కిడ్నాప్ ఆరోపణలతో హెరాత్ పట్టణంలోని ఓ ప్రధాన కూడలి వద్ద ఓ వ్యక్తి మృతదేహాన్ని వేలాడదీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను మరువకముందే.. తాజాగా తఖార్ ప్రావిన్స్‌లో ఓ బాలుడిని దారుణంగా హతమార్చినట్లు తెలుస్తోంది. స్థానిక వార్తాసంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. అతని తండ్రి తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడిన ‘రెసిస్టెన్స్ ఫోర్స్’లో సభ్యుడిగా ఉన్నాడనే అనుమానంతో తాలిబన్లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పేర్కొంది. దీనికి సంబంధించి ఓ వీడియో విడుదల చేయగా.. అందులో ఆ బాలుడి మృతదేహం పక్కన మరో ముగ్గురు చిన్నారులు ఏడుస్తూ కనిపిస్తున్నారు.
దేశంలో 1990ల నాటి తరహాలోనే ఇప్పుడూ కాళ్లు, చేతులు నరకడం వంటి కఠిన శిక్షలు అమల్లో ఉంటాయని తాలిబన్లు ఇటీవల వెల్లడించిన నేపథ్యంలో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. దేశాన్ని ఆక్రమించినప్పటినుంచే మహిళలపై అణచివేతకు పాల్పడుతూ వస్తున్న తాలిబన్లు.. తాజాగా పురుషుల గడ్డాలు, హేర్ స్టైల్స్ విషయంలో నిషేధాజ్ఞలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. స్థానికుల గడ్డాలు గీయడం, స్టైల్‌గా కటింగ్ చేయడం ఆపేయాలంటూ హెల్మంద్ ప్రావిన్స్, కాబుల్‌లోని క్షౌరశాలలకు ఆదేశాలు జారీ అయ్యాయి.