Afghanistan: ‘తాలిబన్లను చూసి భ..భ..భయపడొద్దు..!’

‘‘తాలిబన్ల ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ప్రభుత్వాన్ని చూసి అఫ్గానిస్థాన్‌ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు’’ అఫ్గాన్‌లోని ఓ టీవీ యాంకర్‌ చెప్పిన మాటలివి. కానీ

Updated : 30 Aug 2021 14:59 IST

వెన్నుకు తుపాకులు గురిపెట్టి మరీ.. మీడియాతో చెప్పిస్తున్న ముష్కరులు

కాబుల్‌: ‘‘తాలిబన్ల ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ప్రభుత్వాన్ని చూసి అఫ్గానిస్థాన్‌ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు’’ అఫ్గాన్‌లోని ఓ టీవీ యాంకర్‌ చెప్పిన మాటలివి. కానీ, అవి చెబుతున్నప్పుడు ఆయన భయంతో వణికిపోయారు. అవును మరీ.. ఎందుకంటే అవి ఆయన సొంతంగా చెప్పిన మాటలు కావు.. తాలిబన్లు తుపాకీ గురీ పెట్టి మరీ చెప్పించిన మాటలు. ఓ టీవీ స్టూడియోలోకి చొరబడిన ముష్కరులు అక్కడి యాంకర్‌ను బెదిరించి తాలిబన్లకు అనుకూలంగా ప్రకటన ఇప్పించుకున్నారు. 

యాంకర్ వెనుక ముష్కరులు తుపాకులతో నిల్చున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. దీన్ని ఇరాన్‌కు చెందిన ఓ జర్నలిస్టు తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ.. ‘‘తాలిబన్ల అరాచకాలకు మరో రుజువు’’ అని వ్యాఖ్యానించారు. నిజమే మరీ..! తాము మారిపోయామని, తమని చూసి భయపడొద్దంటూ శాంతివచనాలు వల్లిస్తోన్న తాలిబన్లు.. చేతల్లో మాత్రం తమ సహజసిద్ధ అరాచకాన్నే చూపిస్తున్నారు. మొదట్లో కొద్ది రోజులు ఎలాంటి దాడులకు పాల్పడని ముష్కరులు, దేశాన్ని పూర్తిగా ఆక్రమించిన తర్వాత తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని వెతికి పట్టుకుని మరీ హత్య చేస్తున్నారు.

పత్రికా స్వేచ్ఛకు తాము వ్యతిరేకం కాదన్న తాలిబన్లు.. ఇటీవల అనేక మంది విలేకరులపై దాడులు చేసిన ఘటనలు వెలుగులోకి రావడం గమనార్హం. కాబుల్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత పలువురు జర్నలిస్టుల ఇళ్లలోకి ముష్కరులు చొరబడి వారి బంధువులపై దాడి చేశారు. ఓ విలేకరి కుటుంబ సభ్యుడిని కాల్చి చంపారు. దీంతో భయపడిన పలువురు జర్నలిస్టులు దేశం విడిచి పారిపోతున్నారు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని