Afghan: నేను బతికే ఉన్నా: బరాదర్‌

తన మరణ వార్తలను అఫ్గాన్‌ ఉప ప్రధాని ముల్లా బరాదర్‌ ఖండించారు. తనకేమీ కాలేదని, క్షేమంగానే ఉన్నట్లు తాజాగా ఓ ఆడియో మెసేజ్‌ ద్వారా.....

Updated : 14 Sep 2021 03:17 IST

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లో తాజాగా ఏర్పడ్డ తాత్కాలిక ప్రభుత్వ ఉప ప్రధాని, తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ మృతిచెందినట్లు సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు వైరల్‌గా మారాయి. ప్రెసిడెంట్ ప్యాలెస్‌లో ప్రత్యర్థి వర్గాలతో జరిగిన ఘర్షణలో బరాదర్ గాయపడి, అనంతరం మరణించినట్లు స్థానిక మీడియాలో పలు వార్తలు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలోనే తన మరణ వార్తలను బరాదర్‌ ఖండించారు. తనకేమీ కాలేదని, క్షేమంగానే ఉన్నట్లు తాజాగా ఓ ఆడియో మెసేజ్‌ ద్వారా వెల్లడించినట్లు తెలుస్తోంది. తాలిబన్ల ప్రతినిధి సుహైల్‌ షహీమ్‌ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

ప్రస్తుతం కతర్‌లో ఉన్న సుహైల్‌ షహీమ్‌ ట్విటర్‌ వేదికగా ‘ఇస్లామిక్‌ ఎమిరేట్స్ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌ ఉప ప్రధాని ముల్లా బరాదర్‌ తన మరణవార్తపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. ఆ ఆరోపణలన్నీ అబద్దాలని, వాటిల్లో నిజం లేదని పేర్కొన్నారు’ అంటూ ట్వీట్‌ చేశారు. ఇదే విషయాన్ని అఫ్గాన్‌లోని ప్రముఖ మీడియా సంస్థ టోలో న్యూస్‌ సైతం ధ్రువీకరించింది. ‘తాలిబన్‌ ప్రభుత్వ ఉప ప్రధాని ముల్లా బరాదర్‌ తాను క్షేమంగా ఉన్నట్లు ఓ ఆడియో క్లిప్‌ ద్వారా వెల్లడించారు’ అని తెలిపింది.

అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు అనేక మల్లగుల్లాల అనంతరం తాత్కాలిక ప్రభుత్వాన్ని ప్రకటించారు. తమ ముఠాలో శక్తిమంతమైన  విభాగానికి అధినేతగా ఉన్న ముల్లా మొహమ్మద్‌ హసన్‌ అఖుంద్‌ను ప్రధానమంత్రిగా నియమించారు. ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌కు ఉప ప్రధాని పదవిని కట్టబెట్టారు. అయితే బరాదర్‌ కొద్దిరోజులుగా ఎక్కడా కనిపించడంలేదు. సమావేశాలకు, ప్రెస్‌మీట్లకు హాజరుకావడంలేదు. ఈ నేపథ్యంలోనే ప్రెసిడెంట్ ప్యాలెస్‌లో జరిగిన ఘర్షణలో ఆయన మరణించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని