Published : 07 Sep 2021 18:08 IST

Taliban: అఫ్గానిస్థాన్‌.. ఆ ఆరుగురు..!

మిత్రులకే తాలిబన్ల  పిలుపు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

తాలిబన్లు ఇప్పటి వరకు అధికారాన్ని పంచుకోవడంపై అవగాహనకు రాలేదు. కానీ, అప్పుడే ప్రమాణ స్వీకరణ మహోత్సవానికి అతిథులకు ఆహ్వానాలను పంపించారు. ఆహ్వానాలు అందుకొన్న దేశాల్లో పొరుగున ఉన్న తుర్కెమినిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌లు లేవు. రష్యా,చైనా,టర్కీ,ఇరాన్‌, పాకిస్థాన్‌, కతర్‌లు మాత్రమే ఉన్నాయి. దీనిని బట్టి కేవలం తన మిత్రులకు మాత్రమే ఆహ్వానాలు అందజేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ జాబితాలో సౌదీ అరేబియా, యుఏఈ లేకపోవడం గమనార్హం. వాస్తవానికి 1996లో తాలిబన్లు అధికారం చేపట్టినప్పుడు తొలుత గుర్తించింది పాకిస్థాన్‌, సౌదీ అరేబియా, యూఏఈలే. కానీ, వీటిల్లో పాక్‌ ఒక్కదానికే ఇప్పుడు పిలుపు వచ్చింది.  భౌగోళిక రాజకీయాల్లో వచ్చిన పెనుమార్పుకు ఇది సంకేతం. తాలిబన్లు ఒక్కో దేశాన్ని ఆహ్వానించడానికి ప్రత్యేక కారణాలు.. అవసరాలు ఉన్నాయి. 

ఉగ్రవాదం కలిపిన బంధం..

అమెరికా యుద్ధం ప్రకటించిన సమయంలో పాకిస్థాన్‌ ఒక్కటే తాలిబన్లకు రహస్యంగా మద్దతు ఇచ్చింది. తర్వాత 20 ఏళ్లపాటు ఇది కొనసాగింది. తాలిబన్లకు పాకిస్థాన్‌ మద్దతు లేకపోతే పరిస్థితి మెరుగ్గా ఉండేదని అమెరికన్లే అంగీకరిస్తున్నారు. తాలిబన్ల ప్రతినిధి సుహైల్‌ షహీన్‌ కూడా పాకిస్థాన్‌ను తమ రెండో ఇల్లుగా అభివర్ణించారు. తాలిబన్‌ ఉగ్రవాదులకు పాక్‌ ఆశ్రయం ఇచ్చింది. అంతేకాదు.. తాలిబన్ల అతిథి, అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌కు కూడా ఆశ్రయం ఇచ్చింది. తాలిబన్ల నాయకుల కుటుంబాలు, వారి పిల్లలు పాకిస్థాన్‌లో చదువుతున్నారు. పాకిస్థాన్‌ ఎప్పుడూ తాలిబన్లకు రక్షకుడిగా వ్యవహరిస్తోందని ఆ దేశ మంత్రి షేక్‌ రషీద్‌ బహిరంగంగానే చెప్పారు. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తరచూ తాలిబన్లకు మద్దతుగానే మాట్లాడుతుంటారు. తాలిబన్‌ 2.0కు తొలిసారి గుర్తింపునిచ్చిన దేశాల్లో పాక్‌ ఉంది. 

పరస్పర లాభం కోసం..

అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా వైదలిగిన విధానాన్ని చైనా విమర్శించింది. మరోపక్క తాలిబన్లతో సన్నిహిత సంబంధాలను నెరుపుతోంది. కానీ, తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించే విషయంలో మాత్రం వేచి చూసే ధోరణిని ఎంచుకొంది. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టును విస్తరించడానికి అఫ్గానిస్థాన్‌ను ఓ మంచి అవకాశంగా చూస్తోంది. చైనా నుంచి నేరుగా ఇరాన్‌ను కలుపుతు మార్గం నిర్మించాలన్నది ప్రణాళిక. అదే సమయంలో అఫ్గాన్‌ భద్రత ఆందోళనకు గురి చేస్తోంది. తమకు అఫ్గాన్‌ నుంచి ఆహ్వానం వచ్చిన విషయాన్ని కూడా బయటకు వెల్లడించలేదు. ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ మాట్లాడుతూ ‘నాకు ఎటువంటి సమాచారం లేదు’ అని వెల్లడించారు. అఫ్గానిస్థాన్లో అన్ని వర్గాలను కలుపుకొని ప్రభుత్వం ఏర్పడితే హర్షిస్తామని వాంగ్‌ వెల్లడించారు. పోరుగు దేశాలతో మంచిగా ఉండటాన్ని స్వాగతిస్తామని చెప్పారు. కొన్నాళ్ల క్రితం తాలిబన్‌ రాజకీయ ప్రతినిధి ఘనీ బరాదర్‌ సారథ్యంలో ఒక బృందం  చైనాను సందర్శించింది. కానీ, చైనా దృష్టి మరింత విస్తృతంగా ఉంది. అమెరికా దృష్టి మొత్తం దక్షిణ చైనా సముద్రంలో తనను కట్టడి చేయడం పైనే కేంద్రీకరిస్తుందని బీజింగ్‌ అనుమానిస్తోంది. 

చర్చలకు చొరవ చూపి..

రష్యా 2017లోనే ఆరుగురు భాగస్వాములతో ‘మాస్కో ఫార్మాట్‌’ను ప్రతిపాదించింది. దీనిలో రష్యా, చైనా, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, ఇరాన్‌, ఇండియాల ప్రత్యేక ప్రతినిధులు ఉన్నారు. 2018లో రష్యా అత్యున్నత స్థాయి చర్చలను ఏర్పాటు చేసింది. దీనికి తాలిబన్‌ ప్రతినిధులు, అఫ్గాన్‌ పీస్‌ కౌన్సిల్‌తో పాటు 12 దేశాలను ఆహ్వానించింది. అఫ్గానిస్థాన్‌లో వీలైనంత వేగంగా శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా ఇది సాగింది. ఇందులో రష్యా స్వార్థం కూడా ఉంది. అమెరికాను వీలైనంత త్వరగా ఈ భూభాగం నుంచి వెళ్లగొట్టడం కోసం పనిచేసింది. కానీ, తాలిబన్లతో రష్యాకు భద్రతా పరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీంతో అఫ్గాన్‌ ప్రభుత్వానికి గుర్తింపుపై వేచి చూసే ధోరణి అవలంభిస్తోంది. 

పాత శత్రువుతో కొత్త బంధం..

అఫ్గాన్‌ను తాలిబన్లు పరిపాలిస్తున్న సమయంలో ఇరాన్‌తో ఏమాత్రం సఖ్యత లేదు. అఫ్గాన్‌లో ఇరాన్‌ దౌత్యవేత్త హత్య వివాదం 1998లో యుద్ధం అంచుల వరకు వెళ్లింది. కానీ, ఈ సారి మాత్రం అఫ్గాన్‌ గడ్డ నుంచి అమెరికా వైదొలగడాన్ని ఇరాన్‌ ఆహ్వానించింది. ఇబ్రహీం రైసీ ఇరాన్‌ పగ్గాలు చేపట్టాక వచ్చిన విప్లవాత్మక మార్పు ఇది. కానీ, అఫ్గాన్‌తో షియా-సున్ని వివాదం మాత్రం సమసి పోలేదు. అఫ్గాన్‌లోని హజరాల కోసం ఇరాన్‌ ఆందోళన చెందుతోంది. ఇప్పటికే అమెరికా ఆంక్షలు విధించడంతో పొరుగున్న అఫ్గానిస్థాన్‌తో కూడా విరోధం పనికిరాదని ఇరాన్‌ భావించడంతో కొంత ఉదారవైఖరిని అవలంభించింది. తాలిబన్లకు కూడా పొరుగు దేశమైన ఇరాన్‌తో వ్యాపారం చాలా కీలకం.

అవకాశాలు అందిపుచ్చుకోవడానికి..

అమెరికా వెళ్లిపోయాక అఫ్గానిస్థాన్‌లో తన ప్రాధాన్యం పెంచుకోవాలని టర్కీ ప్రయత్నిస్తోంది. నాటో బలగాల్లో భాగంగా టర్కీ దళాలు దాదాపు 20ఏళ్లు అక్కడ ఉన్నాయి. ఇప్పటికే టర్కీ అధ్యక్షుడు తాలిబన్లకు సహకరించడానికి ముందుకొచ్చారు. గత కొన్నేళ్లుగా తాలిబన్లతో ఈ దేశం సంబంధాలు నెరుపుతోంది. ఇప్పుడు వాటిని విస్తరించనుంది. కాబుల్‌ విమానాశ్రయానికి రవాణా మద్దతును టర్కీ అందించే అవకాశం ఉంది. టర్కీ వస్తువుల విక్రయానికి అఫ్గాన్‌ను ఓ మార్కెట్‌గా చూస్తోంది. అంతేకాదు టర్కీ నిర్మాణ కంపెనీలు కూడా యద్ధంతో దెబ్బతిన్న అఫ్గాన్‌లో మంచి అవకాశాలు లభించనున్నాయని భావిస్తున్నాయి.

అమెరికా ఎంపిక..

తాలిబన్లతో చర్చలకు అమెరికా కతర్‌ను ఎంచుకొంది. కతర్‌ 1996-2001లో తాలిబన్లను గుర్తించలేదు. కానీ, సుహృద్భావ వాతావరణంతో మెలిగింది. మరోపక్క సౌదీ, టర్కీ దేశాలు అఫ్గాన్‌ పౌర ప్రభుత్వంతో మంచి సంబంధాలను నెరపాయి. దీంతో అమెరికా శాంతి చర్చలకు కతర్‌ను వేదికగా ఎంచుకొంది. 2011లో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబమా కోరడంతో దోహాలో తాలిబన్లకు వేదికను కల్పించింది.2013లో అక్కడ తాలిబన్ల పొలిటికల్‌ ఆఫీస్‌ను ఏర్పాటు చేశారు. దాదాపు పదేళ్ల క్రితమే కతర్‌ మధ్యవర్తి పాత్ర మొదలైంది. దీంతోపాటు అమెరికా బలగాల తరలింపులో కతర్‌ ముఖ్య భూమిక పోషించింది. అంతేకాదు ప్రస్తుతం హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి కతర్‌ సాంకేతిక సాయం చేస్తోంది. 

మొత్తం మీద తాలిబన్లకు తొలుత గుర్తింపును ఇచ్చే దేశాల్లో ఈ ఆరు కచ్చితంగా ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. తాలిబన్‌ ప్రభుత్వ ఏర్పాటుపై ఓ స్పష్టత వస్తే అప్పటివరకు ఏ విషయం తేలదు. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని