
Taliban: తాలిబన్ల దిగ్బంధంలో కాబుల్ ఎయిర్‌పోర్టు
(ఫొటో: అఫ్గాన్‌లోని ఓ ప్రాంతంలో పహారా కాస్తున్న తాలిబన్ ఫైటర్లు)
కాబుల్: అఫ్గానిస్థాన్‌లో ఇటీవల ఆత్మాహుతి దాడుల నేపథ్యంలో విమానాశ్రయం వద్ద భారీ రద్దీని తగ్గించేందుకు తాలిబన్లు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కాబుల్ విమానాశ్రయాన్ని దిగ్బంధించారు. ప్రజలు రాకుండా అడ్డుకొనేందుకు అదనపు సిబ్బందిని మోహరించడంతో పాటు విమానాశ్రయానికి వెళ్లే దారుల్లో అదనంగా మరిన్ని చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. అఫ్గాన్ సైన్యం నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలతో తాలిబన్ ఫైటర్లు కాబుల్ రహదారులపై తుపాకీలతో తిరుగతూ పహారా కాస్తున్నారు.
తరలింపు ఆగిపోతే మా పరిస్థితి ఏంటి?.. ఓ అఫ్గాన్ పౌరుడి ఆవేదన
కాబుల్ విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడులు జరిగిన తర్వాత అక్కడి పరిస్థితులపై అఫ్గానిస్థాన్‌లో అమెరికా బలగాలకు అనువాదకుడిగా పనిచేసిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. శుక్రవారం తాను అనుమతి తీసుకొని కొందరితో కలిసి కాబుల్ విమానాశ్రయానికి వెళ్లేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదని పేర్కొన్నాడు. మూడు చెక్ పోస్టులు దాటి వెళ్లినప్పటికీ.. నాలుగో చెక్‌పోస్ట్ వద్ద తనను తాలిబన్లు అడ్డుకున్నారని వాపోయాడు. దీంతో వాదన జరిగిందని తెలిపాడు. అమెరికా పాస్‌పోర్టులు ఉన్నవారిని మాత్రమే అనుమతించాలని అమెరికన్లు తమకు చెప్పినట్టు తాలిబన్లు పేర్కొన్నారన్నాడు. తిరిగి కాబుల్‌కు వచ్చిన అతడు ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తన ఆవేదనను పంచుకున్నాడు. తన భవిష్యత్తు పట్ల తీవ్ర నిరాశను వ్యక్తపరిచాడు. అఫ్గాన్ నుంచి తరలింపు ఆగిపోతే.. తమ పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు, ఇటీవల ఆత్మాహుతి దాడులు, అఫ్గాన్ నుంచి ప్రజల తరలింపునకు ఈ నెల 31వరకు డెడ్‌లైన్ ఉండటంతో అమెరికా సహా పలు పశ్చిమ దేశాలు ఆ దిశగా చర్యలను వేగవంతం చేస్తున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.