Taliban leaders: తాంబూలాలిచ్చిన  అమెరికా.. తన్నుకొన్న తాలిబన్లు..!

అఫ్గానిస్థాన్‌ మరో ప్రచ్ఛన్న యుద్ధానికి వేదికైంది. కతార్‌, పాకిస్థాన్‌ వర్గాలుగా విడిపోయి అధికారం తన్నుకొన్నాయి. ఇటీవల అఫ్గాన్‌ అధ్యక్ష భవనంలో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఈ విషయాన్ని తాలిబన్‌ వర్గాలు ఆంగ్ల వార్త సంస్థ బీబీసీ

Updated : 15 Sep 2021 12:59 IST

 కతర్‌ వర్సెస్‌ పాకిస్థాన్‌ పవర్‌ గేమ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

మీ తిప్పలు మీరు పడండి అంటూ అఫ్గానిస్థాన్‌ను వీడింది అగ్రరాజ్యం అమెరికా..! నాటో దళాలు అలా వెళ్లాయో లేదో  అఫ్గానిస్థాన్‌ మరో ప్రచ్ఛన్న యుద్ధానికి వేదికైంది. కతార్‌, పాకిస్థాన్‌ వర్గాలుగా విడిపోయి అధికారం కోసం తన్నుకొన్నాయి. ఇటీవల అఫ్గాన్‌ అధ్యక్ష భవనంలో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఈ విషయాన్ని తాలిబన్‌ వర్గాలు ఆంగ్ల వార్త సంస్థ బీబీసీ వద్ద ధ్రువీకరించాయి. ఘర్షణ జరిగిన నాటి నుంచి తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడు ముల్లా బరాదర్‌ అదృశ్యమయ్యారు. తొలుత ఆయన ఘర్షణలో చనిపోయారని వార్తలు వచ్చాయి.. కానీ, ఇటీవల బరాదర్‌ ఒక ఆడియోక్లిప్‌ విడుదల చేసి తాను జీవించి ఉన్నట్లు ధ్రువీకరించారు. ఎక్కడ ఉన్నారో మాత్రం చెప్పలేదు. ఇటీవల కతర్‌ ప్రభుత్వంతో తాలిబన్‌ ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. దీనికి హక్కానీ నెట్‌వర్క్‌ కీలక సభ్యులు హాజరయ్యారు కానీ, బరాదర్‌ జాడ మాత్రం కనిపించలేదు.

ఖలీల్‌ హక్కానీతో వివాదం..

మంత్రవర్గం ఏర్పాటు, అఫ్గాన్‌లో తాలిబన్ల విజయంపై ‘క్రెడిట్‌’ ఎవరికి దక్కాలనే విషయంపై హక్కానీ నెట్‌వర్క్‌లోని శక్తిమంతమైన నాయకుడు ఖలీల్‌ ఉర్‌ రహ్మన్‌ హక్కానీ, ముల్లా బరాదర్‌ మధ్య వివాదం మొదలైంది. తమ దౌత్యం వల్లే అమెరికన్లు వెళ్లిపోయారని బరాదర్‌ భావిస్తుండగా.. తాము యుద్ధం చేయడంతోనే అమెరికన్లు పలాయనం చిత్తగించారని హక్కానీ అనుచరులు వాదించారు. ఈ క్రమంలోనే ఇరువురు నాయకులు పరస్పరం పెద్ద పెద్దగా అరుచుకొన్నారు.  అదే సమయంలో పక్కన ఉన్న ఇరువర్గాల సభ్యలు తన్నుకొన్నారు. ఈ విషయాన్ని తాలిబన్‌ సీనియర్‌ నాయకుడు, ప్రత్యక్ష సాక్షులు  బీబీసీ పష్తో వద్ద ధ్రువీకరించారు. ఈ ఘటన గతవారం చివర్లో చోటు చేసుకొంది. ఆ తర్వాత మంత్రివర్గం కూర్పుపై అలిగిన బరాదర్‌ అక్కడి నుంచి కాందహార్‌ వెళ్లిపోయినట్లు సమాచారం. అక్కడ తాలిబన్‌ సుప్రీం లీడర్‌ ముల్లా  హబైతుల్లా అఖుంద్‌జాదాను కలిసేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. త్వరలోనే బరాదర్‌ కాబుల్‌ చేరుకొని మీడియా ముందుకొచ్చి వివాదాన్ని ఖండిచే అవకాశం ఉన్నట్లు తాలిబన్‌ వర్గాలు చెబుతున్నాయి. హక్కానీ గ్రూప్‌ వ్యవస్థాపకుడు జలాలుద్దీన్‌ హక్కానీకి ఖలీల్‌ సోదరుడి వరుస అవుతాడు.

బరాదర్‌ అంటే అందుకే కడుపు మంట..

తాలిబన్‌ అగ్రనాయకుడిగా ముల్లా హిబైతుల్లా అఖుంద్‌జాదా కొనసాగుతున్నారు. కతర్‌ ప్రభుత్వం తాలిబన్‌ సహవ్యవస్థాపకుడు ముల్లా ఘనీ బరాదర్‌తో బలమైన సంబంధాలు పెట్టుకొంది. ఆయనకు దోహాలో కార్యాలయం ఏర్పాటు చేసింది. అమెరికాతో చర్చల్లో అన్నీ తానై సమకూర్చింది. బరాదర్‌ను అఫ్గాన్‌ భవిష్యత్తు నాయకుడి వలే చూసింది. తాలిబన్లను కొంత మార్చి ప్రపంచానికి దగ్గర చేసేందుకు కూడా ప్రయత్నించింది. తాజాగా కాబుల్‌ ఎయిర్‌పోర్టు నిర్వహణ కూడా కతర్‌ సంస్థే చూసుకుంటోంది.

గతంలో పాక్‌ కనుసన్నల్లోని తాలిబన్ల పాలనలో హింసను ప్రపంచ దేశాలు చూశాయి. ఈ నేపథ్యంలో  కతర్‌ సాయంతో వారిలో మార్పు వస్తుందని భావించాయి. అఫ్గానిస్థాన్‌కు మానవతా సాయం చేయాలనుకున్న ఎన్జీవోలు, ప్రభుత్వాలు, దాతలు కతర్‌ ద్వారా అఫ్గానిస్థాన్‌కు అందిస్తున్నారు. అదే సమయంలో వారు పాక్‌ను నమ్మడంలేదు. ఇది పాక్‌కు కంటగింపుగా మారింది.

స్వప్రయోజనాల కోసం ..

ఈ నేపథ్యంలో తాలిబన్లలోని తన వర్గాన్ని పాక్‌ ఎగదోస్తోంది.  సిరాజుద్దీన్‌ హక్కానీ వర్గం, ముల్లా ఒమర్‌ కుమారుడు ముల్లా యాకూబ్‌లను పాకిస్థాన్‌ చేరదీసింది. వీరిద్దరూ పాక్‌కు మద్దతుదారులు. పాక్‌ సైన్యం, ఐఎస్‌ఐ వీరికి కీలక సహకారం అందించింది. అంతేకాదు.. అఫ్గానిస్థాన్‌ ఉగ్రవాదుల పుట్టగా మార్చేసి తన స్వప్రయోజనాలు తీర్చుకోవాలన్నది పాక్‌ వ్యూహం.

పాకిస్థాన్‌కు బరాదర్‌ అంటే అంతర్గతంగా భయాలు, అనుమానాలు ఉన్నాయి. 2010లో బరాదర్‌ను అరెస్టు చేసి దాదాపు రెండేళ్లపాటు పాక్‌ జైల్లో చిత్రహింసలు పెట్టారు. ఇటీవల సీఐఏ చీఫ్‌ విలియమ్‌ బర్న్స్‌ హఠాత్తుగా బరాదర్‌తో భేటీ కావడం ఈ అనుమానాలను పెంచింది.

‘స్ట్రాటజిక్‌ డెప్త్‌’ వ్యూహం అమలుకు పాక్‌ ఆరాటం..

అఫ్గానిస్థానీల రక్తాన్ని కొన్ని దశాబ్దాలు పాక్‌ జలగలా పీల్చి పిప్పి చేస్తోంది. పాక్‌ సైన్యం అనుసరిస్తున్న ‘స్ట్రాటజిక్‌ డెప్త్‌’ పాలసీనే దీనికి కారణం. ‘స్ట్రాటజిక్‌ డెప్త్‌’ అంటే.. ఏ దేశమైన యుద్ధక్షేత్రాన్ని తన అభివృద్ధి చెందిన పట్టణాలకు,నగరాలకు దూరంగా ఉంచడం. పాక్‌ కూడా భారత్‌తో ఘర్షణ నేపథ్యంలో ఉగ్రవాదులను తన దేశం నుంచి అఫ్గానిస్థాన్‌కు ఎగుమతి చేసే ప్రమాదం ఉంది. అంతేకాదు.. నల్ల మందు సాగు వంటి చీకటి కార్యకలాపాలకు కూడా వాడుకొంటుంది. ఇది అమలు కావాలంటే కతర్‌కు అఫ్గాన్‌ పాలకులపై పట్టు ఉండకూడదు. అందుకే ఈ ఘర్షణ..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని