Taliban: అఫ్గాన్‌కు విమానాలు నడపండి.. భారత్‌కు తాలిబన్ల లేఖ

అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ల ఇస్లామిక్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వం భారత్‌తో అధికారిక సంప్రదింపులు జరిపింది. రెండు దేశాల మధ్య కమర్షియల్‌ విమాన సర్వీసులను పునరుద్ధరించాలని

Updated : 29 Sep 2021 19:07 IST

దిల్లీ: అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ల ఇస్లామిక్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వం భారత్‌తో అధికారిక సంప్రదింపులు జరిపింది. రెండు దేశాల మధ్య కమర్షియల్‌ విమాన సర్వీసులను పునరుద్ధరించాలని భారత్‌ను కోరింది. ఈ మేరకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్(డీజీసీఏ)కు అఫ్గాన్‌ పౌరవిమానయాన శాఖ లేఖ రాసింది. ఈ లేఖను భారత పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ సమీక్షిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అఫ్గాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత భారత్‌తో అధికారిక సంప్రదింపులు జరపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

అఫ్గాన్‌ పౌరవిమానయాన శాఖ తాత్కాలిక మంత్రి అల్హజ్‌ హమీదుల్లా అఖుంజాదా సంతకంతో ఉన్న ఈ లేఖను సెప్టెంబరు 7నే పంపినట్లు తెలుస్తోంది. ‘‘అమెరికా దళాలు అఫ్గాన్‌ నుంచి వెనక్కి వెళ్లే క్రమంలో కాబుల్‌ ఎయిర్‌పోర్టు ధ్వంసమైంది. దీంతో అక్కడ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే మా సోదర దేశమైన కతర్ సాంకేతిక సాయంతో విమానాశ్రయాన్ని పునరుద్ధరించగలిగాం. ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలు ప్రారంభించే విషయమై ఇప్పటికే విమానయాన సంస్థలకు నోటీసులు పంపాం. భారత్‌, అఫ్గాన్‌ మధ్య తిరిగి ప్రయాణికుల రాకపోకలు జరగాలని కోరుకుంటున్నాం. కమర్షియల్‌ విమానాల సేవలను పునరుద్ధరించాలని కోరుతున్నాం’’ అని లేఖలో రాసినట్లుగా ఉంది.  అయితే తమ లేఖకు భారత్‌ నుంచి ఇంకా స్పందన రాలేదని తాలిబన్‌ ప్రతినిధులు తెలిపారు.

ఆగస్టు 15న అఫ్గాన్‌ రాజధాని కాబుల్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత నుంచి ఆ దేశానికి కమర్షియల్‌ విమనాల రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆ తర్వాత భారత ప్రభుత్వం అమెరికా, నాటో దళాల సాయంతో ప్రత్యేక విమానాలు నడిపి అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు