Updated : 04 Sep 2021 14:08 IST

Panjshir: తాలిబన్ల చేతుల్లోకి పంజ్‌షేర్‌..? ఖండించిన ఉత్తర కూటమి సేనలు

పంజ్‌షేర్‌: అమెరికా బలగాల ఉపసంహరణతో విజృంభించిన తాలిబన్లు అఫ్గాన్‌ మొత్తాన్ని అక్రమించుకున్నారు. కానీ ఒక్క పంజ్‌షేర్‌ మాత్రం వారికి ఇంకా అందని ద్రాక్షలాగే మిగిలింది. తాజాగా ఈ ప్రాంతం కూడా తమ వశమైనట్లు తాలిబన్‌ వర్గాలు వెల్లడించాయి. అయితే తాలిబన్ల ప్రకటనను ఉత్తరకూటమి సేనలు ఖండిస్తున్నాయి. పంజ్‌షేర్‌ ఇంకా తమ ఆధీనంలోనే ఉందని చెబుతున్నాయి. 

‘‘దేవుడి దయతో మొత్తం అఫ్గానిస్థాన్‌ మా నియంత్రణలోకి వచ్చేసింది. పంజ్‌షేర్‌ కూడా మా కమాండ్‌లోకి వచ్చేసింది’’ అని తాలిబన్‌ కమాండర్‌ ఒకరు తాజాగా ప్రకటించడం సంచలనంగా మారింది. పంజ్‌షేర్‌పై విజయంతో తాలిబన్లు సంబరాలు చేసుకుంటున్నట్లు సోషల్‌మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ వార్తలపై పూర్తి స్పష్టత రాలేదు. 

తాలిబన్ల ప్రకటనను తాలిబన్‌ వ్యతిరేక శక్తుల నాయకులు అమరుల్లా సలేహ్‌, అహ్మద్‌ మసూద్‌ ఖండించారు. పంజ్‌షేర్‌ ఇంకా తమ నియంత్రణలో ఉందని, తాలిబన్లకు తాము తలొగ్గేది లేదని వెల్లడించారు. ‘‘తాలిబన్లకు వ్యతిరేకంగా పోరు కొనసాగుతూనే ఉంది. మా మాతృభూమి కోసం మేం పోరాడుతూనే ఉంటాం’’ అని సలేహ్‌ ట్విటర్‌లో వెల్లడించారు. అయితే పరిస్థితులు మాత్రం చాలా కఠినంగా ఉన్నాయని సలేహ్‌ చెప్పుకొచ్చారు. ఉత్తరకూటమికి చెందిన ఇతర నేతలు కూడా తాలిబన్‌ ప్రకటనను తోసిపుచ్చారు.

కాబుల్‌కు ఉత్తరాన దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉండే పంజ్‌షేర్‌ ప్రావిన్సు దశాబ్దాల నుంచి తాలిబన్లకు కొరకరాని కొయ్యే! హిందుకుష్‌ పర్వత శ్రేణుల్లోని ఈ ప్రాంతం శత్రు దుర్భేద్యం. పోరాటాలకు పెట్టింది పేరైన ఈ ప్రావిన్సు ప్రస్తుతం అహ్మద్‌ మసూద్‌ నాయకత్వంలో ఉంది. తాలిబన్ల విజృంభణ అనంతరం అఫ్గాన్‌ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ సహా గత ప్రభుత్వంలోని పలువురు నేతలు పంజ్‌షేర్‌కే వచ్చేశారు. ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు తాలిబన్లు భీకర పోరాటం జరుపుతున్నారు. అయితే తాలిబన్లను ఉత్తర కూటమి సేనలు కూడా అంతే దీటుగా నిలువరిస్తున్నాయి. ఈ యుద్ధంలో పదుల సంఖ్యలో తాలిబన్లు మృతిచెందినట్లు వార్తలు కూడా వచ్చాయి.

తాలిబన్ల సంబరాల్లో 17 మంది మృతి..

పంజ్‌షేర్‌ తాలిబన్ల వశమైందన్న వార్తలతో ముష్కరులు సంబరాల్లో మునిగిపోయారు. కాబుల్‌లో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో 17 మంది మరణించగా.. 41 మంది గాయపడినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని