Afghnisthan: తాలిబన్ల అరాచకాలు.. సెక్స్‌ బానిసలుగా స్త్రీలు!

స్త్రీల హక్కులను గౌరవిస్తామని, వారినీ పనిచేసుకునేందుకు అనుమతిస్తామన్న తాలిబన్ల హామీ నీటి మూటలే అని అర్థమవుతోంది. మునుపటి స్వభావానికి భిన్నంగా వారేమీ ప్రవర్తించడం లేదనే వాదనలకు బలం చేకూరుస్తూ వారి క్రూరత్వాన్ని చాటే కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Updated : 24 Nov 2022 14:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్త్రీల హక్కులను గౌరవిస్తామని, వారినీ పనిచేసుకునేందుకు అనుమతిస్తామన్న తాలిబన్ల హామీ నీటి మూటలే అని అర్థమవుతోంది. మునుపటి స్వభావానికి భిన్నంగా వారేమీ ప్రవర్తించడం లేదనే వాదనలకు బలం చేకూరుస్తూ వారి క్రూరత్వాన్ని చాటే కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అఫ్గానిస్థాన్‌కు చెందిన నజ్లా ఆయూబీ అనే మాజీ న్యాయమూర్తి వారి దారుణాలను వెలుగులోకి తెచ్చారు. అమెరికాలో నివాసముంటున్న ఆమె.. ‘స్కై న్యూస్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్గాన్‌లో మహిళలపై జరుగుతున్న అరాచకాలను బయటపెట్టారు.

తమకు సరిగ్గా వండిపెట్టలేదన్న కారణంతో ఉత్తర అఫ్గానిస్థాన్‌కు చెందిన ఓ మహిళను చిత్రహింసలకు గురిచేసి ఆమెకు నిప్పు పెట్టారని ఆయూబీ తెలిపారు. తాలిబన్‌ ఫైటర్లకు వండిపెట్టాలని అక్కడి ప్రజలపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. స్థానిక యువతులను చెక్కపెట్టెల్లో బంధించి సెక్స్‌ బానిసలుగా మార్చేందుకు కొన్ని వారాలుగా ఇతరప్రాంతాలకు తరలిస్తున్నారంటూ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఆయా ప్రాంతాల్లో ఉండే యువతులను తమ ఫైటర్లకిచ్చి వివాహం చేయాలనీ అక్కడి కుటుంబాలపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. ఓ వైపు ఇలాంటి దారుణాలకు పాల్పడుతూ మహిళలను స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చని ఇంకో వైపు హామీలు ఇస్తున్నారని ఆయూబీ చెప్పారు. మహిళల హక్కుల కోసం పోరాడే తనలాంటి వారు తాలిబన్ల పాలనలో జీవించడం కష్టమన్న ఉద్దేశంతోనే తాను పారిపోయి వచ్చినట్లు చెప్పారు.

మరోవైపు తమను కార్యాలయాలకు వెళ్లకుండా తాలిబన్లు అడ్డుకున్నారంటూ ఇప్పటికే పలువురు మహిళా జర్నలిస్టులు తమ గోడును ప్రపంచానికి వెళ్లబోసుకున్నారు. మహిళలకు పనిచేసేందుకు అవకాశం కల్పిస్తామంటూ తాలిబన్లు ప్రకటించిన కొద్దిరోజులకే ఈ ఘటనలు జరుగడం గమనార్హం. దీంతో మహిళల హక్కుల పరిరక్షణకు వారిచ్చిన హామీ నీటిమీద రాతలే అని తేలిపోయింది. ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న ఈ దారుణాలను చూస్తుంటే అఫ్గాన్‌లో పరిస్థితులు మున్ముందు మరింత దిగజారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని