
Afghan: విమానాశ్రయంలోని ప్రవేశించేందుకు యత్నం.. వ్యక్తిపై తాలిబన్ కాల్పులు
కాబుల్: అఫ్గానిస్థాన్ అట్టుడుకుతోంది. అఫ్గాన్‌ను తాలిబన్లు వశపరుచుకోవడంతో ప్రాణభయంతో అక్కడి ప్రజలు ఇతర దేశాలకు తరలిపోతున్నారు. అయితే ఎలాగైనా ప్రాణాలు రక్షించుకోవాలని భావించిన ఓ వ్యక్తి కాబూల్ విమానాశ్రయం గోడపై నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. విమానాశ్రయం లోపల ఉన్న తాలిబన్ దీన్ని గమనించి అతడిపై కాల్పులు జరిపాడు. బుల్లెట్ అతడికి సమీపంలో గోడకు తగలడంతో సదరు వ్యక్తి వెంటనే అవతలివైపునకు దూకాడు. ఈ వీడియోను అస్వాకా అనే న్యూస్ ఏజెన్సీ ట్విటర్‌లో పోస్టు చేసింది.
అఫ్గాన్‌లో పరిస్థితులు దయనీయంగా మారాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు విమానాల్లో కిక్కిరిసి ఇతర దేశాలకు పారిపోతున్నారు. విమానం టైర్ల వద్ద నిల్చొని ప్రయాణించిన ముగ్గురు కిందపడి ప్రాణాలు కోల్పోయిన ఘటన తెలిసిందే. ఈ వీడియో వైరల్‌గా మారింది. మరో వీడియోలో.. కాబుల్ విమానాశ్రయం రన్‌వేపై నుంచి బయలుదేరుతున్న విమానం వద్ద గుంపులుగుంపులుగా ఉన్న జనం ఆ విమానాన్ని ఎక్కేందుకు పరుగులు తీస్తున్నారు. విమానం టైర్లు, హ్యాండిళ్లు ఇలా ఏది దొరికితే దాన్ని పట్టుకొని దేశాన్ని వీడి వెళ్లేందుకు విమానం వెంట పరుగులు తీశారు.