Afghanisthan: మద్యం సీసాలు పగులకొట్టి.. పిల్లల పుస్తకాలు ధ్వంసం చేసి..

తాలిబన్లు నార్వే రాయబార కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులోని మద్యం సీసాలను పగులగొట్టారు. పిల్లల పుస్తకాలను ధ్వంసం చేశారు.

Published : 10 Sep 2021 01:54 IST

కాబుల్‌: తాలిబన్లు అఫ్గాన్‌ రాజధాని కాబుల్‌లోని నార్వే రాయబార కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులోని మద్యం సీసాలను పగులగొట్టి, పిల్లల పుస్తకాలను ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని నార్వే రాయబారి సిగ్వాల్డ్ హౌజ్ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘‘కాబుల్‌లోని మా కార్యాలయాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. ముందుగా మద్యం సీసాలను పగులకొట్టారు. పిల్లల పుస్తకాలను నాశనం చేశారు’’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.

గతంలో తాలిబన్లు రాయబార కార్యాలయాలతో సహా విదేశీ దేశాల దౌత్య సంస్థల్లో జోక్యం చేసుకోబోమన్నారు. కానీ, దానికి భిన్నంగా వ్యవహరిస్తూ వారి వక్రబుద్ధిని మరోసారి నిరూపించుకున్నారు.
కాబుల్‌లో ఉన్న తమ రాయబార కార్యాలయాలను మూసివేస్తామని డెన్మార్క్‌, నార్వే దేశాలు గత నెలలోనే ప్రకటించాయి.
తాజాగా ‘కాబుల్‌లోని రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించాం’ అని డానిష్‌ విదేశాంగ మంత్రి జెప్పే కొఫోడ్ తెలిపారు. అనంతరం నార్వే విదేశాంగ మంత్రి ఇనే సోరైడ్ కూడా రాయబార కార్యాలయాన్ని మూసివేసి నార్వే దౌత్యవేత్తలు, సిబ్బందిని ఖాళీ చేయనున్నట్లు వెల్లడించారు. కాగా అమెరికా సైన్యం అఫ్గాన్‌ నుంచి నిష్క్రమించిన తర్వాత అక్కడే చిక్కుకొన్న 200 మంది అమెరికన్లు, ఇతర విదేశీయులను చార్టర్ విమానాల్లో తీసుకెళ్లడానికి తాలిబన్లు అంగీకరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని