Afghanistan: అఫ్గాన్‌లో దిగజారిన శాంతిభద్రతలు.. వెంట ఆయుధాలకు అనుమతి!

తాలిబన్ల పాలనలోని అఫ్గాన్‌లో ఆర్థిక సంక్షోభం, అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో దేశంలో శాంతిభద్రతలు సైతం దిగజారుతోన్నట్లు తెలుస్తోంది. తాజాగా స్థానిక వ్యాపారులు తమ భద్రత కోసం ఆయుధాలు వెంట తీసుకెళ్లేందుకు తాలిబన్లు...

Updated : 20 Oct 2022 11:52 IST

కాబుల్‌: తాలిబన్ల పాలనలోని అఫ్గాన్‌లో ఆర్థిక సంక్షోభం, అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో దేశంలో శాంతిభద్రతలు సైతం దిగజారుతోన్నట్లు తెలుస్తోంది. తాజాగా స్థానిక వ్యాపారులు తమ భద్రత కోసం ఆయుధాలు వెంట తీసుకెళ్లేందుకు తాలిబన్లు అనుమతులు జారీ చేయడం.. ఈ వాదనలకు బలం చేకూర్చుతోంది. ఆయా సాంకేతిక సమస్యల పరిష్కారం అనంతరం ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరోవైపు వ్యాపారులు, పెట్టుబడిదారుల భద్రతకు కట్టుబడి ఉన్నామని ఆ శాఖ అధికార ప్రతినిధి సయీద్ ఖోస్టాయ్ తెలిపారు. అఫ్గాన్‌ ఆక్రమణ అనంతరం తాలిబన్లు.. పౌరులు, ఇతర వ్యవస్థల నుంచి ఆయుధాలు తీసేసుకున్నారు. తాలిబన్లు మినహా మరెవరూ వాటిని కలిగి ఉండటానికి వీళ్లేదని స్పష్టం చేశారు.

ఇలాగైతే అంతర్యుద్ధ పరిస్థితుల్లోకే..

అఫ్గాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత తాలిబన్లు.. స్థానిక పౌరులు, ముఖ్యంగా మైనారిటీల భద్రత విషయంలో విఫలమవుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు పేర్కొంటున్నాయి. ఇదే విషయమై అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు డీ వాలేరియో ఫ్యాబ్రీ మాట్లాడుతూ.. తాలిబన్లు ప్రస్తుతం పరిపాలన విషయంలో అతిపెద్ద పరీక్ష ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. మరోవైపు పెరుగుతున్న ఐఎస్‌కేపీ ఉగ్రదాడులు.. తాలిబన్ల శాంతి భద్రతల నిర్వహణా సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నట్లు చెప్పారు. వెంటనే ఈ సవాళ్లను పరిష్కరించేందుకు చొరవ చూపకుంటే.. దేశం అంతర్యుద్ధ పరిస్థితుల్లోకి దిగజారుతుందని హెచ్చరించారు. ఇప్పటికే కరవు పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్న ఈ దేశ ఆర్థిక వ్యవస్థ రాబోయే నెలల్లో 30 శాతం లేదా అంతకంటే ఎక్కువకు పడిపోవచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) ఇటీవలే హెచ్చరించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని