Published : 29 Dec 2021 01:37 IST

USA: బాంబులు వాడేయాలి.. తొందరగా టార్గెట్లుచెప్పండి..!

 సిరియా, ఇరాక్‌ యుద్ధాల్లో అరాచకం సృష్టించిన డెత్‌స్క్వాడ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

అమెరికాకు చెందిన 20 మంది డెల్టా ఫోర్స్‌ సిబ్బంది.. వేల సంఖ్యలో బాంబులను, క్షిపణులను ఇష్టారాజ్యంగా వినియోగించారు. కేవలం వేగంగా దాడి చేయాలనే లక్ష్యంతోనే నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. ఫలితంగా లెక్కలేనన్ని అమాయకపు ప్రాణాలు గాల్లో కలిశాయి. ఆత్మరక్షణకు దాడులు చేసేందుకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశారు. వీరి అరాచకానికి సీఐఏ వంటి కరుడుగట్టిన నిఘా సంస్థల పెద్దలే అభ్యంతరాలు వ్యక్తం చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అదే ‘టలోన్‌ యాన్విల్‌’ బృందం. ఇటీవల ‘ది టైమ్స్‌’, ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పత్రిక పలు ఆధారాలతో కథనాలను ప్రచురించి దీనిని బహిర్గతం చేశాయి.

ఏమిటీ టలోన్‌ యాన్విల్‌..!

2014లో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు రెచ్చిపోయి దాడులు చేయడం మొదలుపెట్టారు. వీరి దాడులు ఐరోపా ఖండానికి కూడా పాకాయి. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన అమెరికా అత్యున్నత దళమైన డెల్టా ఫోర్స్‌కు చెందిన కొంత మంది సభ్యుల బృందాన్ని 2014లో అనధికారికంగా ఏర్పాటు చేశారు. వాస్తవానికి ‘టలోన్‌ యాన్విల్’ అధికారికంగా  ఏమీ లేదు. కానీ వీరు సిరియా, ఇరాక్‌ల్లో జరిగిన యుద్ధ రంగంలో ఐసిస్‌పై పోరులో కీలక పాత్ర పోషించారు. వీరు తమ ఫస్ట్‌నేమ్‌లను మాత్రమే వాడతారు. సైన్యంలో వీరి ర్యాంకులు, హోదాలను అధికారికంగా వెల్లడించరు. గడ్డాలు పెంచుకొని.. షార్ట్స్‌, సాధారణ చెప్పులు వేసుకొని సిరియాలోని కార్యాలయాలకు హాజరవుతారు. వీరు డ్రోన్‌ దాడులకు అత్యాధునిక కంట్రోల్‌ రూమ్‌లను వినియోగిస్తారు. ప్రిడేటర్‌, రీపర్‌ డ్రోన్లను వినియోగించి హెల్‌ఫైర్‌ క్షిపణులు, లేజర్‌ గైడెడ్‌ బాంబులతో లక్ష్యాలపై దాడులు చేస్తుంటారు. వీరికి మరో సెకండ్‌ స్ట్రైక్‌ గ్రూప్‌ ఉంది. ఈ గ్రూప్‌ ఐసిస్‌లోని పెద్ద తలకాయలను వేటాడటానికి అమెరికా నిఘా సంస్థ సీఐఏతో కలిసి పని చేసింది.

లక్షకు పైగా బాంబులు, క్షిపణుల వినియోగం..

ఈ బృందాలు 2014-19 వరకు మూడు షిఫ్ట్‌ల్లో పనిచేస్తూ ఉగ్ర కాన్వాయ్‌లు, కారు బాంబులు, ఐసిస్‌ మూకలపై దాడులు నిర్వహించాయి. కానీ, వీటిల్లో చాలా వరకు దాడుల్లో పౌరులు కూడా మరణించారు. ఈ బృందం మొత్తం 1,12,000 క్షిపణులు, బాంబులను వాడినట్లు పెంటగాన్‌ లెక్కలు చెబుతున్నాయి. హై ర్యాంకింగ్‌ మిలటరీ అధికారుల అనుమతులు తీసుకోకుండానే చాలా దాడులు జరిగాయి. 2019లో జరిగిన బాంబింగ్‌లో డజన్ల కొద్దీ మహిళలు, పిల్లలు చనిపోవడంతో ఎక్కడో తప్పు జరుగుతోందని అమెరికా సైనిక నాయకత్వానికి అనుమానం వచ్చింది. ఈ దాడి కూడా టలోన్‌ యాన్విల్‌ నిర్వాకమే. దీనిపై నవంబర్‌లో దర్యాప్తు చేపట్టింది.

డ్రోన్ల ఆయుధాలను ఖాళీ చేయడం కోసం దాడి..

గస్తీకి వెళ్లిన డ్రోన్లపై ఉన్న ఆయుధాలు ఖాళీ చేయడం కోసమే దాడులు నిర్వహించిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.  సిరియాలో ‘కరమా’ అనే చిన్న గ్రామంపై 2017 మార్చిలో ఇలానే దాడి చేశారు. తెల్లవారు జామున టలోన్‌ యాన్విల్ సిబ్బంది ఒకరు ఎయిర్‌ఫోర్స్‌ ఇంటెలిజెన్స్‌ బృందంతో సంప్రదించాడు. గ్రామంలోని ఒక ఇంటి ఫుటేజీ చూపించి.. అది ఐసిస్‌ ఉగ్రవాదుల శిక్షణ కేంద్రంగా వెల్లడించాడు. ఎయిర్‌ఫోర్స్‌ ఇంటెలిజెన్స్‌ ఆ లక్ష్యాన్ని విశ్లేషిస్తుండగానే.. ‘ఈ రోజు చాలా లక్ష్యాలను చూపించు.. డ్రోన్లపై ఆయుధాలు ఖాళీ చేసి వెళ్లాలి’ అని మెసేజ్‌ చేశాడు. ఆ ఇంటి నుంచి ఉగ్రవాదుల ఎలక్ట్రానిక్‌ సిగ్నల్స్‌ను తన డ్రోన్‌ గుర్తించిందని చెప్పి.. సమాధానం కోసం చూడకుండా పావు టన్ను బాంబును వెంటనే ప్రయోగించాడు. ఈ చర్యతో ఎయిర్‌ఫోర్స్‌ ఇంటెలిజెన్స్‌ అవాక్కైంది. బాంబిగ్‌ తర్వాత అక్కడి ఫుటేజీని విశ్లేషించగా.. పిల్లలు, మహిళలు ఉన్నట్లు తేలింది.  అదే నెలలో ఐదు రోజుల వ్యవధిలో 47 దాడులు వీరు నిర్వహించారు.

టాస్క్‌ ఫోర్స్‌-9 కనుసన్నల్లో..!

టలోన్‌ యాన్విల్‌ దాడుల విభాగాన్ని ప్రత్యేక దళాలకు చెందిన టాస్క్‌ఫోర్స్‌ 9 అనే బృందం పర్యవేక్షిస్తుంది. దీని కార్యకలాపాలు అత్యంత గోప్యంగా ఉంటాయి. ఇరాక్‌, సిరియాల్లో క్షేత్ర స్థాయిలో కుర్దులు, అరబ్‌ దళాల దాడులను , శిక్షణను ఇదే చూసుకొంటుంది. ఈ క్రమంలో క్షేత్ర స్థాయి నుంచే వచ్చే బలహీనమైన ఇంటెలిజెన్స్‌ను నిర్ధారించుకోకుండా వీరు దాడులు చేసినట్లు తేలింది. వీటికి ఆత్మరక్షణ అనే సాకును వాడుకొన్నారు. 
అమెరికా వాయుసేన పైలట్లు, సీఐఏ అధికారులు కూడా టలోన్‌ యాన్విల్‌ దారుణంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కొంత మంది పైలట్లు  టలోన్‌ యాన్విల్‌కు సహకరించేందుకు నిరాకరించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అఫ్గానిస్థాన్లో అమెరికా దాడులతో పోలిస్తే సిరియాలో జరిగిన దాడుల్లో 10 రెట్ల మంది పౌరులు మరణించినట్లు అమెరికా ‘డిఫెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ 2018 నివేదిక’ రాసిన లారీ లెవిస్‌ పేర్కొన్నారు. ఆయన గతంలో పెంటగాన్‌ సలహాదారుగా పనిచేశారు. ఈ దాడులను పర్యవేక్షించిన కతర్‌లోని టాస్క్‌ఫోర్స్‌ 9కు చెందిన జనరల్‌ స్టీఫెన్‌ టౌన్‌సెండ్‌ను పదోన్నతిపై ఆఫ్రికా కమాండ్‌కు చీఫ్‌గా పంపించారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్