Updated : 26 May 2022 22:40 IST

PM Modi: చెన్నైలో ప్రధాని మోదీ.. తమిళ భాష, సంస్కృతులపై ప్రశంసల జల్లు!

చెన్నై: తమిళ భాషా సంస్కృతులపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. తమిళ భాష శాశ్వతమైనదని, అక్కడి ప్రజల సంస్కృతి విశ్వవ్యాపితమైందిగా పేర్కొన్నారు. ప్రతి రంగంలోనూ తమిళనాడుకు చెందిన పౌరులు ప్రతిభ కనబరుస్తున్నారని.. ఇటీవల జరిగిన డెఫెలింపిక్స్‌లో భారత్‌ 16 పతకాలు సాధించగా.. అందులో ఆరు పతకాలు తమిళనాడు యువతే కైవసం చేసుకున్నారని కొనియాడారు. గురువారం హైదరాబాద్‌ పర్యటన ముగించుకొని నేరుగా చెన్నైకి చేరుకున్న ప్రధాని అక్కడ దాదాపు రూ.31వేల కోట్లకు పైగా నిధులతో చేపట్టే పలు అభివృద్ధి ప్రాజెక్టులను శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చెన్నైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. తమిళ భాష, సంస్కృతులను మరింత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందరి.. ఈ జనవరిలో సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్లాసికల్‌ తమిళ్‌ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ క్యాంపస్‌ను పూర్తిగా కేంద్రం నిధులతోనే ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. దేశంలోని పలు చోట్ల మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కులను అభివృద్ధి చేసి, తద్వారా దేశ వాణిజ్య పర్యావరణ వ్యవస్థలో కీలక రూపును తీసుకురానున్నట్టు తెలిపారు. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు దేశ ఆత్మనిర్భరతకు దోహదం చేస్తుందన్నారు. మౌలికవసతుల కల్పనకు ప్రాముఖ్యతను ఇచ్చిన దేశాలు.. అభివృద్ధి చెందుతున్న దశ నుంచి అభివృద్ధి చెందిన దేశాలుగా మారాయన్నారు. తమ ప్రభుత్వం అత్యున్నత నాణ్యతతో కూడిన మౌలికవసతుల కల్పనకు కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు.

శ్రీలంకను ఆదుకుంటున్నాం..

బెంగళూరు- చెన్నై మధ్య ఎక్స్‌ప్రెస్‌వే రెండు కీలక అభివృద్ధి కేంద్రాలను కలుపుతోందని ప్రధాని అన్నారు. చెన్నై పోర్ట్‌ను మధురవాయల్‌కు అనుసంధానించే నాలుగు లైన్ల ఎలివేటెడ్ రహదారి చెన్నై పోర్టును మరింత సమర్థంగా తీర్చిదిద్దడంతో పాటు నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రిస్తుందని చెప్పారు. శ్రీలంక దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో అండగా నిలబడుతున్నామన్నారు. అక్కడి క్లిష్ట పరిస్థితులతో తమిళ ప్రజలు ఆందోళన చెందుతున్నారని తనకు అర్థమైందని.. పొరుగున ఉన్న, భారత్‌కు సన్నిహిత దేశమైన శ్రీలంక ఆర్థిక సహాయంతో పాటు ఆహారం, ఔషధాలు, పలు రకాల నిత్యావసర వస్తువులను కేంద్రం అందిస్తోందని చెప్పారు. 

కొత్త ప్రభుత్వం వచ్చాక.. తొలిసారి చెన్నైకి మోదీ..

తమిళనాడులో గతేడాది డీఎంకే సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి ప్రధాని తమిళనాడు పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం స్టాలిన్‌ ఘన స్వాగతం పలికారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో చెన్నైలో దాదాపు 20వేల మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు చోట్ల ట్రాఫిక్‌ను మళ్లించారు. బెంగళూరు-చెన్నై మధ్య నిర్మిస్తున్న 262 కి.మీల ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు 11 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా భాజపా కార్యకర్తలు పార్టీ జెండాలతో నినాదాలు చేస్తూ సాంస్కృతిక ప్రదర్శనలతో ఘన స్వాగతం పలికారు. 

హిందీలా తమిళ్‌ను అధికార భాషగా గుర్తించండి: స్టాలిన్‌

హిందీ భాషలాగే తమిళంను అధికార భాషగా గుర్తించాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రధాని మోదీని కోరారు. చెన్నైలో మోదీతో కలిసి వేదికను పంచుకున్న సందర్భంగా స్టాలిన్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక విజ్ఞప్తులు చేశారు. నీట్‌ పరీక్ష నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని, మద్రాస్‌ హైకోర్టులో తమిళ భాషను అధికారికం చేయాలని కోరారు. గతేడాది తమిళనాడులో అధికారంలోకి వచ్చిన డీఎంకే.. తమిళ భాషను అధికార, పరిపాలన భాషగా చేయాలని డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని