
Tamil Nadu: సీఏఏకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం
చెన్నై: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేశారు. 2019లో పార్లమెంట్ ఆమోదించిన సీఏఏ చట్టం రాజ్యాంగంలో పేర్కొన్న లౌకిక నిబంధనలకు అనుగుణంగా లేదన్న సీఎం స్టాలిన్.. ఈ చట్టాన్ని రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. దేశంలో మత సామరస్యానికి భంగం వాటిల్లకుండా చూసేందుకే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలో నిర్ధేశించిన లౌకిక నిబంధనలను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని స్టాలిన్ వివరించారు.
స్టాలిన్ మాట్లాడుతూ.. ‘ఒక దేశ పరిపాలన ఆ దేశ ప్రజల ఆలోచనలు, భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రజాస్వామ్యం పేర్కొంటోంది. కానీ ఈ పౌరసత్వ సవరణ చట్టం మాత్రం శరణార్థులను ఆశ్రయం ఇవ్వకుండా.. మతం, జాతి పేరుతో వారిపై వివక్ష చూపేలా ఉంది. శ్రీలంక తమిళులు ఇక్కడ పౌరసత్వం పొందే వీలును సీసీఏ అడ్డుకునేలా ఉంది’ అని పేర్కొన్నారు. కాగా ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ భాజపా మిత్రపక్షం, విపక్ష ఏఐఏడీఎంకే పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగుచట్టాలకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ గత నెల తీర్మానాన్ని ఆమోదించింది. దీంతో సాగు చట్టాలను ఉపసంహరించుకున్న ఏడో రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. వ్యవసాయం, మత్స్యసంపద, పశుసంవర్ధక శాఖలపై చర్చల కోసం అసెంబ్లీ సమావేశమైన వెంటనే తీర్మానాన్ని ప్రతిపాదించిన సీఎం స్టాలిన్.. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరారు. తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని సభకు విజ్ఞప్తి చేయగా సభ ఆమోదం తెలిపింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.