Tamil Nadu: భాజపా నుంచి మరో ఆడియో క్లిప్.. ఇరకాటంలో ఆర్థిక మంత్రి..!

తమిళనాడు(Tamil Nadu) ప్రభుత్వంపై భాజపా రాష్ట్ర విభాగం తీవ్రస్థాయి ఆరోపణలు చేస్తోంది. తాజాగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు షేర్‌ చేసిన ఆడియో క్లిప్‌లో డీఎంకే(DMK) నేత, ఆర్థిక మంత్రి సొంత ప్రభుత్వంపై విమర్శలు చేసినట్లుగా వినిపిస్తోంది. 

Published : 26 Apr 2023 13:50 IST

చెన్నై: అధికార డీఎంకే(DMK) పార్టీపై అవినీతి ఆరోపణలు చేస్తూ తమిళనాడు భాజపా చీఫ్ కే అన్నామలై (Tamil Nadu BJP chief K Annamalai ) వరుస ఆడియో క్లిప్‌లు విడుదల చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన మరో ఆడియో క్లిప్‌.. ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి పీటీఆర్‌ పళనివేల్‌ త్యాగరాజన్‌ (PTR)ను ఇరకాటంలో పడేసేలా ఉంది. అందులో ఆయన మాటలు డీఎంకేను విమర్శిస్తూ, ముఖ్యమంత్రి స్టాలిన్(MK Stalin) కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేసినట్లు ఉన్నాయి. ఇంకోపక్క భారతీయ జనతా పార్టీ అంతర్గత వ్యవస్థను ప్రశంసించారు.

తాజాగా ఆడియో క్లిప్‌ను ట్విటర్‌లో షేర్ చేసిన అన్నామలై(K Annamalai) .. ‘డీఎంకే పార్టీ వ్యవస్థ అంతర్గతంగా ఎలా కుప్పకూలుతుందో ఇందులో వినవచ్చు. తమిళనాడు(Tamil Nadu) ఆర్థిక మంత్రికి సంబంధించి ఇది రెండో ఆడియో క్లిప్‌ ఇది. డీఏంకే, భాజపా మధ్య ఉన్న తేడాను వెల్లడించినందుకు ఆయనకు థ్యాంక్స్‌’ అని స్పందించారు. 

గతంలో కూడా పీటీఆర్ మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఆడియో క్లిప్‌ వైరల్‌ అయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌, అల్లుడు శబరీశన్‌లు ఏడాదిలో సుమారు రూ.30 వేల కోట్లు సంపాదించారని అన్నట్టు ఉన్న ఆడియోను అన్నామలై ట్విటర్‌లో షేర్ చేశారు. దీనికిముందు స్టాలిన్‌ (MK Stalin), ఆ పార్టీ సీనియర్లు భారీ స్థాయిలో అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపిస్తూ ‘డీఎంకే ఫైల్స్‌’ పేరిట వివరాలు వెల్లడించారు. అవన్నీ అసంబద్ధ ఆరోపణలని డీఎంకే వాటిని తోసిపుచ్చింది. ఇందుకుగానూ అన్నామలై వెంటనే బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేయడంతోపాటు తమ పరువుకు నష్టం కలిగించినందుకు పరిహారంగా రూ.500 కోట్లను చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని