DMK files: ‘డీఎంకే నేతల అక్రమాస్తుల చిట్టా’ : తమిళనాడు భాజపా చీఫ్‌ ఆరోపణలు

డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin) తోపాటు ఆయన పార్టీ ముఖ్యనేతలకు భారీ స్థాయిలో అక్రమాస్తులు ఉన్నాయని ఆ రాష్ట్ర భాజపా ఆరోపించింది.

Published : 14 Apr 2023 22:51 IST

చెన్నై: డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin), ఆ పార్టీ సీనియర్లు భారీ స్థాయిలో అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని భాజపా ఆరోపించింది. ‘డీఎంకే ఫైల్స్‌’ పేరుతో తమిళనాడు భాజపా అధ్యక్షుడు కె.అన్నమలై (Annamalai) ఈ ఆరోపణలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. తమిళనాడు కొత్త సంవత్సరం (ఏప్రిల్‌ 14) సందర్భంగా డీఎంకే మంత్రుల అక్రమాస్తుల చిట్టా విడుదల చేస్తానంటూ అన్నమలై గతంలోనే ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా వాటిని బయటపెట్టారు. అయితే, ఈ ఆరోపణలను డీఎంకే కొట్టిపారేసింది.

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను లక్ష్యంగా చేసుకున్న అన్నమలై.. 2011లో డీఎంకే అధికారంలో ఉన్న సమయంలో చెన్నై మెట్రో రైల్‌ కాంట్రాక్టు విషయంలో అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. ఆ చెల్లింపులు కూడా షెల్‌ కంపెనీల ద్వారా జరిగాయన్నారు. వీటితోపాటు డీఎంకే ముఖ్య నేతల ఆస్తులు.. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న దానికంటే భారీ స్థాయిలో పెరిగాయన్నారు. కేవలం డీఎంకే అవినీతిపైనే కాకుండా ఇతర పార్టీలు చేసే కుంభకోణాలను వ్యతిరేకిస్తామని అన్నమలై స్పష్టం చేశారు.

ఇది కేవలం ఒక పార్టీపై చేస్తోన్న పోరాటం కాదని.. అవినీతి వ్యతిరేక పోరాటమని అన్నమలై ఉద్ఘాటించారు. డీఎంకే నేతల కుంభకోణాలను బహిరంగ పరిచేందుకు జూన్‌ తొలివారంలో యాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. అయితే, అన్నమలై చేసిన ఆరోపణలను డీఎంకే ఖండించింది. ఆయన చెప్పిన వివరాలన్నీ హాస్యాస్పదమని డీఎంకే ఎంపీ ఆర్‌ఎస్‌ భారతి స్పష్టం చేశారు. అదానీపై హిండెన్‌బర్గ్‌ విడుదల చేసిన నివేదిక నుంచి దృష్టి మరల్చేందుకే భాజపా ప్రయత్నిస్తోందని.. ముఖ్యమంత్రిపై అన్నమలై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్‌ విసిరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని