
ప్లాస్టిక్‌కు చెక్ పెడుతూ స్టాలిన్ మరో నిర్ణయం
చెన్నై: అనేక వినూత్న నిర్ణయాలతో దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి బాటలో నడుస్తూ అనేక విప్లవాత్మక, వినూత్న నిర్ణయాలతో ముందుకెళుతున్న తమిళనాడు సీఎం స్టాలిన్ మరో పాత సంస్కృతికి ఊపిరులూదారు. ముఖ్యంగా తన తండ్రి గతంలో చేపట్టినవి, చేపట్టాలని కలలు కన్న అంశాలను ఆచరణలో పెడుతున్నారు. ఈ క్రమంలో గత స్మృతుల్లోకి తీసుకెళుతూ రాష్ట్రంలో తిరిగి పసుపు సంచుల వాడకాన్ని ప్రోత్సహించేలా మీండుం మంజప్పై (తిరిగి పసుపు సంచులు) ప్రచారాన్ని చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. పర్యావరణం, సహజ వనరులకు కోలుకోలేని నష్టాన్ని కల్గించే హాని కలిగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకానికి చరమగీతం పాడటమే ప్రచార లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరూ పసుపు సంచులు ఉపయోగించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ..పర్యావరణానికి కలిగించే హానికారకాలు మానవాళిని మళ్లీ పాతాళంలోకి నెట్టేస్తుందని హెచ్చరించారు. పర్యావరణాన్ని కాపాడేవారి చిహ్నం ఇకపై పసుపు సంచిగా అభివర్ణించారు. పసుపు సంచులు పర్యావరణానికి సరైనవని, అందమైన ప్లాస్టిక్ సంచులు పర్యావరణానికి హానికల్గిస్తాయని స్టాలిన్ తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు పసుపు సంచులు అందించారు.
పర్యావరణాన్ని కాపాడటంలోనూ ముందుండాలి
ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించడం ద్వారా కలిగే నష్టాలను స్టాలిన్ ప్రస్తావించారు. అన్ని రంగాల్లో మార్గదర్శక రాష్ట్రంగా నిలుస్తున్న తమిళనాడు పర్యావరణాన్ని కాపాడటంలోనూ ముందుండాలన్నారు. ప్రకృతిని కాపాడాలని ప్రకృతితో కలసి పయనించాలని పర్యావరణానికి విఘాతం కల్గించే ప్లాస్టిక్‌కు చరమగీతం పాడుదామని పిలుపునిచ్చారు. పసుపుసంచి తీసుకెళ్లడం ఎవరూ అవమానకరంగా భావించాల్సిన అవసరం లేదని, పర్యావరణాన్ని కాపాడేవారి చిహ్నమే పసుపుసంచి అని పేర్కొన్నారు.ఒకసారి ఉపయోగించి పారేసే ప్లాస్టిక్‌ను అంతం చేసేందుకు ప్రజావిప్లవం రావాలని గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించింది.ఈనేపథ్యంలో పసుపుసంచి ఉపయోగం గురించి అవగాహన కల్పించేందుకు మీండుం మంజప్పైని సీఎం ప్రారంభించడం గమనార్హం.