Tamil Nadu: 12 గంటల పనివేళలపై.. స్టాలిన్‌ వెనక్కి..?

రోజుకు 12 గంటల పనివేళలపై తమిళనాడు (Tamil Nadu) సర్కారు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని స్టాలిన్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Published : 24 Apr 2023 20:08 IST

చెన్నై: ప్రైవేటు సంస్థలు, పరిశ్రమల్లో ఉద్యోగుల పనివేళలను (Working Hours) రోజుకు 12 గంటలకు పెంచుతూ తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు, విమర్శలు వెల్లువెత్తడంతో స్టాలిన్‌ సర్కారు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పరిశ్రమల చట్టంలో సవరణలు చేస్తూ తీసుకొచ్చిన బిల్లును ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin) సోమవారం సాయంత్రం తన మిత్రపక్షాలతో సమావేశమై దీనిపై చర్చించనున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.

ప్రైవేటు సంస్థలు, పరిశ్రమల్లో వారంలోని మొత్తం పనివేళల్లో (Working Hours) మార్పులేకుండా రోజుకు 12 గంటలు పనిచేసేలా స్టాలిన్‌ ప్రభుత్వం (Stalin Govt) ఇటీవల ఓ బిల్లు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రకారం.. వారంలో నాలుగు రోజులు మాత్రమే పనిచేసి, మిగతా మూడు రోజులు విశ్రాంతి తీసుకోవచ్చు. 4 రోజుల తర్వాత పనిచేస్తే దానికి తగిన వేతనం ఉండేలా బిల్లు రూపొందించారు.

బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గత శుక్రవారం ఈ బిల్లును కార్మిక సంక్షేమశాఖ మంత్రి సీవీ గణేశన్‌ శాసనసభలో ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాలు సహా అధికార కూటమిలోని కొందరు సభ్యుల వ్యతిరేకత నడుమ మూజువాణి విధానంలో ఈ బిల్లును ఆమోదించారు. అయితే ఈ బిల్లుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ బిల్లుతో కార్మికులు శ్రమ దోపిడీకి గురై ప్రమాదముందని ప్రతిపక్షాలే గాక.. డీఎంకే మిత్రపక్షమైన కాంగ్రెస్‌ కూడా ఆరోపించింది. ఇది పరిశ్రమల యాజమాన్యానికి అనుకూలమైన బిల్లుగా ఉందని మరికొందరు నేతలు విమర్శించారు. ఈ నేపథ్యంలోనే బిల్లుపై స్టాలిన్‌ ప్రభుత్వం పునరాలోచన చేసినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని