Tamil nadu: అసెంబ్లీలో అధినేతల్ని పొగిడితే చర్యలు.. స్టాలిన్‌ ఆసక్తికర నిర్ణయం

ప్రజా సమస్యలపై చర్చించే అసెంబ్లీలో పొగడ్తలతో సమయాన్ని వృథా చేస్తే చర్యలు తీసుకుంటామని మంత్రులు, ఎమ్మెల్యేలను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ హెచ్చరించారు.....

Published : 30 Aug 2021 01:24 IST

చెన్నై: అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తనదైన శైలిలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరో ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. ప్రజా సమస్యలపై చర్చించే అసెంబ్లీలో పొగడ్తలతో సమయాన్ని వృథా చేస్తే చర్యలు తీసుకుంటామని మంత్రులు, ఎమ్మెల్యేలను హెచ్చరించారు. పార్టీ అధినేతల్ని పొగడ్తలతో ముంచెత్తి తమ ఉనికి చాటుకోవడం ద్రవిడ రాజకీయాల లక్షణమని, అన్నాడీఎంకే హయాంలో జయలలిత నుంచి పళనిస్వామి వరకు ఇదే పద్దతి కొనసాగిందని స్టాలిన్‌ పేర్కొన్నారు. కానీ డీఎంకే పాలనలో అలాంటివి కుదరవని స్టాలిన్‌ స్పష్టం చేశారు. అసెంబ్లీలో పార్టీ నాయకత్వాన్ని, ముఖ్యమంత్రిని ప్రశంసిస్తూ సమయాన్ని వృథా చేయకుండా సభా కార్యకలాపాలను కొనసాగించాలని తెలిపారు. ప్రతిదానికి ఓ పరిమితి ఉందన్న డీఎంకే అధినేత.. వ్యక్తి ఆరాధన మానుకోవాలని స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగుచట్టాలకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. దీంతో సాగు చట్టాలను ఉపసంహరించుకున్న ఏడో రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. వ్యవసాయం, మత్స్యసంపద, పశుసంవర్ధక శాఖలపై చర్చల కోసం అసెంబ్లీ సమావేశమైన వెంటనే తీర్మానాన్ని ప్రతిపాదించిన సీఎం స్టాలిన్.. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరారు. తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని సభకు విజ్ఞప్తి చేయగా.. సభ ఆమోదం తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని