Tamil Nadu: ప్రసంగంపై స్టాలిన్ అభ్యంతరం.. అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్‌

తమిళనాడు(Tamil Nadu) గవర్నర్ అసెంబ్లీలో చదివిన ప్రసంగంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గవర్నర్ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. 

Updated : 09 Jan 2023 16:29 IST

చెన్నై: తమిళనాడు(Tamil Nadu)  గవర్నర్, అక్కడి ప్రభుత్వానికి మధ్య వివాదం మరింత ముదిరింది. గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(RN Ravi) అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగాన్ని మాత్రమే రికార్డు చేయాలంటూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) స్పీకర్‌ను కోరిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రసంగాన్ని యథావిధిగా ఉంచాలంటూ అసెంబ్లీ తీర్మానాన్ని కూడా ఆమోదించింది. ఈ క్రమంలోనే ఆయన సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. 

రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగంలోని లౌకికవాదం గురించి, పెరియార్, బీఆర్ అంబేడ్కర్‌, కె. కామరాజ్‌, సీఎన్‌ అన్నాదురై, కరుణానిధి వంటి ప్రముఖ నేతల పేర్లను ప్రస్తావించకుండా గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అలాగే తమిళనాడు ప్రభుత్వం ప్రచారం చేస్తోన్న ద్రవిడియన్ మోడల్‌ గురించి కూడా ఆయన చదవలేదు. దీనిపై అధికార పార్టీ(DMK) తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రసంగాన్ని యథావిధిగా ఉంచాలంటూ అసెంబ్లీలో తీర్మానాన్ని తీసుకువచ్చింది. గవర్నర్ వ్యవహరించిన తీరు అసెంబ్లీ సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందని దానిలో స్టాలిన్ విమర్శించారు. ఆయన ప్రసంగాన్ని డీఎంకేతో పాటు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం వంటి పార్టీలు బాయ్‌కాట్ చేశాయి. బిల్లులపై సంతకం చేయడంపై ఆయన చేస్తోన్న ఆలస్యంపైనా సభ్యులు నినాదాలు  చేశారు. తమిళనాడును వదిలివెళ్లండి, భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాన్ని ఇక్కడ రుద్దకండి అనే నినాదాలు అసెంబ్లీలో మారుమోగాయి. తమిళనాడు(Tamil Nadu)కు తమిళగం(Thamizhagam)పేరు సరిగా సరిపోతుందని ఇటీవల రవి చేసిన వ్యాఖ్యలపైనా వారు ఆందోళన చేశారు. 

గత కొద్ది కాలంగా గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి పలు విషయాల్లో అభిప్రాయభేదాలు వస్తున్నాయి. గవర్నర్.. భాజపా ఇచ్చిన ఆదేశాల మేరకు పనిచేస్తున్నారని డీఎంకే విమర్శిస్తోంది. రాష్ట్రంలో భాజపాకు రెండో అధ్యక్షుడిగా నడుచుకోవడం మానుకోవాలని గవర్నర్‌పై ఎంపీ టీఆర్ బాలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వద్ద శాసన సభ ఆమోదించిన 21 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని